విశాఖ జిల్లాలో నమోదైన మొదటి సహకార సంఘం జాగృతి సంస్థ. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో.. మహిళలకు పొదుపు అలవాటు చేయడం కోసం 1992లో సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో ఈ పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని దేవీపురానికి చెందిన ఎన్.ప్రహ్లాదశాస్త్రి.. ఈ సంఘం ఏర్పాటుకు ఆద్యుడు. పది మందితో మొదలైన ఈ సంఘం.. ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
2021 నాటికి జిల్లాలోని సబ్బవరం, గాజువాక, పరవాడ, పెందుర్తి, కె.కోటపాడు, అనకాపల్లి మండలాల్లోని 259 గ్రామాల్లో ఏకంగా.. 22 వేల మంది మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీళ్లంతా 18 కోట్లకుపైనే పొదుపు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటి నుంచి 23వ తేదీ వరకు.. సిబ్బంది గ్రామాలకు వెళ్లి.. మహిళా మండలి కన్వీనర్ ఆధ్వర్యంలో రుణాలు అందజేస్తారు. ప్రస్తుతం 5 వేల నుంచి పది వేల రూపాయల వరకు గ్రామాల్లో రుణం అందిస్తున్నారు. అంతకుమించి రుణం కావాలనుకునే వారు బ్యాంకులో తీసుకోవాల్సి ఉంటుంది.
''మహిళల అభివృద్ధికోసం ఈ సంఘాన్ని నెలకొల్పుకున్నాం. సహకార వ్యవస్థ చట్టప్రకారం దీనిని ఏర్పాటు చేయడంతో భద్రత కల్పించాం. మహిళలు తమకాళ్లమీద తాము నిలబడేలా చేసేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం.''- సుజాత, జాగృతి సంస్థ ఎండీ
''ఇది ఒక మూవింగ్ బ్యాంకు. బ్యాంకే వినియోగదారుల ఊరికి వెళ్లి సేవలను అందిస్తుంది. రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు వారి ఇంటి వద్దే రుణం అందిస్తాం. ఎక్కువ మెుత్తంలో లోన్ కావాలంటే ఆఫీస్ కు రావలసి ఉంటుంది.'' - మౌక్తిక, జాగృతి సంస్థ సీఈఓ