అమరావతిని పరిపాలన రాజధానిగా చేసి.. వాణిజ్య రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయటం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక ఒడిదొడుకులపై సామాజిక మాధ్యమాల్లో ఆయన స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో.. "మీరు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి అయితే ఏం చేస్తారు" అని ట్విట్టర్లో ఎదురైన ప్రశ్నకు బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు సమకూర్చగలిగేది విశాఖ నగరం ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. చైనా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న తయారీరంగ పరిశ్రమలను మన రాష్ట్రానికి తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమానికి అప్పులు మాని... అందుబాటులో ఉన్న నిధులే ఖర్చు చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్రం భాగం పంచుకోవాల్సిన వాటికి పూర్తిగా నిధులు కేటాయించాలన్నారు. తద్వారా మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయటం.. కేంద్రం నుంచి కొత్త వాటిని సాధించడం వంటి పనులు చేయాలని సూచించారు. కేంద్రంతో సత్సంబంధాలు నెరపి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టాలని చెప్పారు.