విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ కేంద్రానికి సమీపంలో కొండల్లో విసిరేసిన కుగ్రామం బంధలపనుకు. ఈ గ్రామం ప్రభుత్వ లెక్కల్లో ఉన్నప్పటికీ...అక్కడి గిరిజనులు ఏ రికార్డులలోనూ లేరు. విద్యుత్, మంచినీరు, రహదారి వంటి మౌలిక సదుపాయాలకు వారు ఆమడ దూరం. రెండు నెలల కిందట వీరి సమస్యను ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన అధికారులు...ఆ గ్రామంలో పర్యటించి ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు.
స్థానిక ఎంపీడీవో వెంకన్నబాబు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ప్రస్తుతం ఆధార్ కార్డులు మంజూరు చేయించారు. త్వరలో రేషన్, ఓటర్ కార్డులతో పాటు ప్రభుత్వ ఇళ్లు, వ్యవసాయ భూముల పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు. ఎంపీడీవో తన సొంత ఖర్చులతో ఆధారు కార్డులు ఇప్పించటం పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసి...తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన ఈటీవీ భారత్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.