విశాఖ గాజువాకలో ఓ యువతి ప్రేమోన్నాది చేతిలో దారుణ హత్యకు గురైంది. నగరంలోని సుందరయ్యనగర్‌కు చెందిన యువతి ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. గాజువాకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సమయంలో అఖిల్ అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. గత మూడేళ్లుగా ఇద్దరి మధ్య ఆ పరిచయం కొనసాగుతోంది. ఇటీవల ఆ యువతి రాము అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోందని, వారి స్నేహాన్ని భరించలేక అఖిల్ కత్తితో దాడి చేశాడు.
నాలుగు రోజుల కిందట యువతి విషయంలో రాము, అఖిల్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ బాహాబాహీకి దిగారు. అయితే శనివారం సాయంత్రం శ్రీ నగర్ జంక్షన్ సాయిబాబా గుడి వద్ద యువతి, రాము మాట్లాడుకుంటుండగా అఖిల్ చూశాడు. తీవ్ర ఆగ్రహంతో ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని వచ్చాడు. అప్పటికీ అక్కడే ఉన్న యువతిపై కత్తితో దాడి చేశాడు. భయంతో రాము అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో యువతి కొట్టుకుంటుండగా అఖిల్ తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అఖిల్ తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అఖిల్‌ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.
యువతి మేనమామ కూతురి పెళ్లి పనుల్లో ఇంట్లో అంతా సందడిగా ఉంది. సాయిబాబా గుడికి వెళ్లి వస్తానని యువతి... తల్లికి చెప్పి వెళ్లింది. అలా వెళ్లిన కొద్దిసేపటికే యువతి మరణ వార్తను కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. యువతి మరణవార్తను విని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. పదో తరగతిలో 9.5, ఇంటర్మీడియట్ లో 9.8 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిన ఆ చదువుల తల్లిని...ఓ కఠినాత్ముడు బలితీసుకున్నాడు.