భారత్ ద్వీపకల్ప దేశం(India is a peninsular country). త్రివిధ దళాలకు ఎంత పదును పెడితే అంత రక్షణ మనదేశానికి లభిస్తుంది. త్రివిధ దళాలలో ఒకటైన నౌకాదళ శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు భారత్ సిద్ధమౌతోంది. సముద్రజలాలపై పట్టు బిగించేందుకు భారత నౌకాదళం(Indian Navy) సరికొత్త హంగులు దిద్దుకుంటోంది. ఈ అధ్యాయంలో ఇప్పుడు దేశీయ పరిజ్ఞానం తోడవుతోంది. దేశీయంగా తయారైన యుద్ధ నౌకలు, తదితర అనుబంధ నౌకలు, యంత్ర సామగ్రి వెరసి భారత నౌకాదళానికి నిరంతరం కొత్త శక్తులు సమకూరుస్తూనే ఉన్నాయి. ఐఎన్ఎస్ విశాఖతో (INS Visakha)పాటు మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant) కూడా ఈ జాబితాలో ఉంది. ఇది ఆరేళ్ల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకుని వివిధస్థాయిల్లో పరీక్షలు ఎదుర్కొంటోంది. ప్రాథమిక ట్రయిల్స్ విజయవంతంగా పూర్తి చేసింది. కొద్దినెలల్లో తుది పరీక్షలు పూర్తి చేసుకుని 2022లో నౌకాదళంలో కమిషన్ కానుంది. 30 యుద్ధ విమానాల్ని మోసుకుపోగల సామర్థ్యమున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకా దళానికి వెయ్యేనుగుల బలమివ్వనుంది.
ఐఎన్ఎస్ విశాఖతోపాటు మరో బ్రహ్మాస్త్రం..
భారత నౌకాదళం పొదిలో ఐఎన్ఎస్ విశాఖతో పాటు మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. 1971 పాక్ యుద్ధంలో విజయానికి కారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకకు 1997లోనే వీడ్కోలు పలికారు. విజయానికి(Victory), శౌర్యానికి (Bravery)మారు పేరైన విక్రాంత్ పేరిట విమాన వాహక యుద్ధ నౌక (Aircraft carrier) సిద్ధం చేయాలని భారత ప్రభుత్వం ఆనాడే నిశ్చయించింది. అది కార్యరూపం దాల్చి 1999లో ఇండియన్ నేవీ కి చెందిన డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ దీనికి రూపకల్పన చేసింది. ఈ నౌక డిజైనింగ్ పూర్తైన తర్వాత కొచ్చి షిప్ యార్డులో కీలక భాగాల తయారీ ఆరంభించారు. 2009లో దీని నిర్మాణం కీలక దశకు చేరుకుంది. 2011లో కొచ్చి డ్రైడాక్ నుంచి విక్రాంత్ బయటకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం అంటే 2015లో జూన్ లో కొచ్చిలోనే జల ప్రవేశం లాంఛనంగా చేసింది. అక్కడి నుంచి వివిధ రకాల పరీక్షలను ఎదుర్కొంది ఈ బాహుబలి నౌక.
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు..
దక్షిణ నౌకాదళంలోని కొచ్చి ప్రాంతంలో బేసిన్ ట్రయిల్స్(Basin Trails) అన్నింటిని ఒక్కొక్కటిగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ అతి భారీ విమాన వాహక నౌక ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో కొచ్చిలోనే దాదాపు 2 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది. తొలి దశ ట్రయిల్స్ విజయ వంతం(first step trials success) కావడం వల్ల నౌకాదళం రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రాజెక్టులో ముందుకు దూసుకు వెళ్తోంది. నాలుగు ఎల్ ఎం 2500 గ్యాస్ టర్బైన్లు, ప్రధాన గేర్ బాక్స్ లు, ప్రొపైల్లర్ నియంత్రణ, సమీకృత నియంత్రణ విధానం, సెంట్రిఫ్యూజన్, విద్యుత్తు ఉత్పత్తి, అంతర్గత సమాచార వ్యవస్ధ వంటి కీలక విభాగాల పని తీరుపై తొలి దశ పరీక్షలలో దృష్టి పెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు. ఎత్తు 59 మీటర్లు. బరువు దాదాపు 40 వేల టన్నులు. సూపర్ స్ట్రక్చర్లు 5 ఉండగా డెక్ లు 14 అందుబాటులో ఉన్నాయి.
కంపార్టుమెంట్లు 2వేల 300 వరకూ ఉన్నాయి. మహిళా సిబ్బంది అవసరాల కోసం ప్రత్యేక క్యాబిన్ లు ఏర్పాటు చేశారు. 1700 మందికి పైగా సిబ్బంది ఇందులో విధులు నిర్వర్తించేలా సిద్ధం చేశారు. 2 విమాన రన్‌వేలూ అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకు పోగలదు ఐఎన్‌ఎస్ విక్రాంత్. వేల సంఖ్యలో ఆయుధాలు, నిర్దేశిత సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లు, 30 యుద్ధ విమానాలు మోసుకుపోగలదు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఈ నౌక సొంతం. యాంటీ రేడార్, యాంటీ సబ్ మెరైన్, గగన తల నిఘా, సముద్ర జలాలపై నిఘా వ్యవస్థలన్నీ ఇందులో అమర్చారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. ప్రమాద నిరోధక వ్యవస్థలు అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ప్రమాద సమయంలో సిబ్బంది అత్యంత వేగంగా సురక్షితంగా బయటపడే వ్యవస్థలను ఏర్పాటుచేశారు.