అమ్మ..తన బిడ్డల కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చెయ్యగల గొప్ప త్యాగమూర్తి. నవమాసాలు మోసి కన్నబిడ్డ కోసం తల్లి చేసే సాహసాలు వర్ణనాతీతం. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని, కనీసం బొడ్డు కూడా ఊడక ముందే వద్దనుకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు. నిత్యం అనేకచోట్ల చెత్త కుప్పలలో, మురికి కాలవలలో విగతజీవులుగా పడి ఉంటున్న పసికందులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు.
తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లి శారదా నది సమీపంలోని చెత్తకుండీలో ఆడ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా..వారు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పసికందును పడేసి వెళ్ళినట్లుగా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని వదిలించుకోడానికి ఇలా చేశారా ? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆడ శిశువు మృతి ఘటనకు సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారమివ్వాలని అనకాపల్లి పట్టణ ఎస్ఐ రామకృష్ణ ప్రజలను కోరారు.