ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమ మద్యం స్వాధీనం.. నాటుసారా స్థావరాలపై దాడులు

అక్రమంగా మద్యం తరలిస్తున్న బళ్లారికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అనంతపురం పోలీసులు తెలిపారు. వారి నుంచి 768 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

police raids
పోలీసులు, ఎస్​ఈబీ అధికారుల దాడులు

By

Published : Mar 20, 2021, 2:07 PM IST

కర్ణాటకలోని బళ్లారి నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. అనంతపురం-బళ్లారి 42వ జాతీయ రహదారిపై దాదాపు రూ.76 వేలు విలువ చేసే 768 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. కారు సీజ్​ చేశామని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. వాహనాన్ని మద్యం రవాణాకు అనుగుణంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. వెనుక వైపు సీటు కింది భాగంలో ప్రత్యేకంగా ఒక పాత్ర మాదిరి తయారు చేయించి.. అందులో మద్యాన్ని పెట్టి తరలిస్తున్నారని అన్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో..
బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామంలో నాటుసారా స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన మూడు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. అక్కడున్న సామగ్రిని కాల్చివేశామని పేర్కొన్నారు. పోలీసులు రాక తెలుసుకుని సారా తయారీదారులు పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరూన్ భాష తెలిపారు.

విశాఖ జిల్లాలో..
ట్యాంకర్​ లారీలో తరలిస్తున్న సుమారు 700 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు పాయకరావుపేట పోలీసులు తెలిపారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు అప్రమత్తమై.. పీఎల్ పురం కూడలి వద్ద వాహనాల తనిఖీ నిర్వహించామని చెప్పారు. ఈ తనిఖీల్లో గంజాయితో పాటు.. దాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో...
రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గ్రామంలోని ఒక ఇంటిలో దాచి ఉంచిన 37 బస్తాల రేషన్ బియ్యం, 5 బస్తాల కందిపప్పును స్వాధీనం చేసుకున్నామని మండల రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ఇబ్రహీం తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేట మండలం పుదూరు గ్రామం సమీప ఆటవీ ప్రాంతంలో తెలుగుగంగ కాల్వల వద్ద జూదం స్థావరంపై దాడులు చేసినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రెండు బైక్​లు, రెండు మొబైల్​ ఫోన్లు, రూ.69,400 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:నాటుసారా కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

ABOUT THE AUTHOR

...view details