జీవీఎంసీలో 10 వేల లోపు ఓటర్లున్న ఏకైక వార్డు... 78. జోన్-5లోని స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న టౌన్‌షిప్ ఇది. కేవలం ఇక్కడి ఉద్యోగులే ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడంతా ఉద్యోగుల క్వార్టర్లే ఉన్నాయి. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకునేవారే. పలువురు ఎక్కువ కాలం ఇక్కడ ఉండరు. బదిలీలతో ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు.
7వ వార్డులోని గతంలోని గ్రామాలన్నీ ఇప్పుడు లే అవుట్‌లుగా మారి అపార్ట్‌మెంట్‌లకు నెలవుగా మారాయి. ఇందుకు సరైన ఉదాహరణగా జోన్-1లోని 7వ వార్డును తీసుకోవచ్ఛు మధురవాడ, పిలకవానిపాలెం, చంద్రంపాలెం, మిథిలాపురి వుడాకాలనీ లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వార్డులో ఉన్న వాంబేకాలనీ అత్యంత పెద్దకాలనీ. ఈ ఒక్కచోటే 6500పైగా ఓటర్లున్నారు. స్వతంత్ర నగర్ కాలనీలో ప్రభుత్వమే పట్టాలిచ్చింది. దీంతో ఇక్కడ మూడు వేలకుపైగా ఓటర్లు స్థిరపడ్డారు.
ఎంత మార్పు..
2007లో ఓటర్లు 11,37,331
2021లో ఓటర్లు 17,53,927
2007లో జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల జరగడం ఈ సారే. ఈ 14 ఏళ్లలో ఓటర్లలో 35.15 శాతం వృద్ధి కనిపించింది. నగరం పారిశ్రామికంగా ఎదగడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఫలితంగా అపార్ట్‌మెంట్ సంస్కృతికి పెద్దపీట వేశారు. దీనికి అదనంగా కాలనీలు, లేఅవుట్‌లు శివారులో వచ్చేశాయి. పరిశ్రమలు, ఐటీ, ఇతరత్రా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులున్న ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారంతా ఇప్పుడు ఓటర్లుగా మారారు.
జీవీఎంసీలో ఎక్కువ ఓటర్లున్నది 6వ వార్డులోనే. ఇక్కడ జనాభా ఇంతలా పెరగడానికి కారణం.. లేఅవుట్‌లు, హౌసింగ్‌బోర్డుకాలనీ, ఇతర గృహవసతి పెరగడం. ఉద్యోగులు ఇక్కడ ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ప్రధానంగా కొమ్మాది, దేవిమెట్ట, సేవానగర్, జీసీసీ లేఅవుట్, వైభవ్‌నగర్, ప్రశాంతినగర్, బక్కనపాలెం, రేవళ్లపాలెం, సాయిప్రియలేఅవుట్, పీఎంపాలెం, ఆర్‌హెచ్‌కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీల్లో ఓటర్లు ఉన్నారు. చాలామంది అపార్ట్‌మెంట్లు కొనుక్కుని ఇక్కడున్నారు. సాఫ్ట్‌వేర్, కార్పొరేట్, విద్యాసంస్థలు, వ్యాపార, ఇతరత్రా కంపెనీల్లో పనిచేసేవారు ఓటర్లుగా మారారు.
86వ వార్డులో స్టీల్‌ప్లాంటు, దువ్వాడ రైల్వేస్టేషన్, వీఎస్‌ఈజెడ్, వివిధ విద్యాసంస్థలు ఉన్నాయి. జాతీయ రహదారి దగ్గర్లోనే ఉండటంతో ఎక్కువ మంది ఈ ప్రాంతంలో స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణహితంగా, కాలుష్యానికి దూరంగా ఉన్న వార్డుగా ఇది పేరుపొందింది. ఇక్కడివారు అవగాహనతో తమ ప్రాంతాలు వృద్ధిచెందేలా చేసుకున్నారు. ఈ వార్డులోని కూర్మన్నపాలెం, శాతవాహననగర్, దువ్వాడ స్టేషన్‌రోడ్డు, దువ్వాడ సెక్టార్-2, పకీర్‌తకియా తదితర ప్రాంతాల్లో ఈ తరహా పరిస్థితులు కనిపిస్తాయి. అపార్ట్‌మెంట్ల సంఖ్య అనూహ్యరీతిలో ఇక్కడ పెరిగింది.
మొత్తం జీవీఎంసీ ఓటర్లలో దాదాపు 17 వార్డుల్లోనే ఏకంగా 22.31 శాతం మంది ఓటర్లున్నారు. ఇవన్నీ జోన్-1, 2, 5, 6 పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. శివారు ప్రాంతాలు వృద్ధి చెందుతుండటంతో అక్కడే ఎక్కువగా జనం స్థిరపడ్డారు
ఇదీ చదవండి:ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్