దేవుడిపై ప్రమాణాలు చేయాలని తెదేపా, వైకాపా ప్రమాణ సవాళ్లతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆదివారం ఉద్రిక్తత కొనసాగింది. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో శనివారం నుంచి ఈ నియోజకవర్గంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇవాళ గాజువాక మండలం మింది నుంచి భారీ వాహన శ్రేణితో వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశాఖ బీచ్ రోడ్డులోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం 11 గంటల సమయంలో విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడికి ర్యాలీగా వచ్చారు.
విశాఖ 'తూర్పు'న ఉద్రిక్తత.. సాయిబాబా గుడికి ఎమ్మెల్యే అమర్నాథ్
10:14 December 27
తెదేపా, వైకాపా ప్రమాణ సవాళ్లతో ఉత్కంఠ
మా పార్టీ పెద్దలపై ఆరోపణలు చేసినందుకే మేం స్పందించాం. స్థానికేతరుడైన వెలగపూడి విశాఖలో భూఆక్రమణలకు పాల్పడ్డారు. ఆధారాలుతో సహా బాబా గుడికి వచ్చాం. విజయసాయిరెడ్డి వస్తేనే ప్రమాణం చేస్తామని ఆయన అనడం సరికాదు. భూ అక్రమాలపై త్వరలో సిట్ నివేదిక వస్తుంది. దాని ప్రకారం బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది- గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే
గంట పాటు కార్యకర్తలతో కలసి అమర్నాథ్ ఆలయం వద్దే ఉన్నారు. అప్పటికీ వెలగపూడి రాకపోవటంతో సాయిబాబా గుడి నుంచి ఎమ్మెల్యే అమర్నాథ్, కార్యకర్తలు వెనుదిగిరారు. వైకాపా శ్రేణులు వెళ్లిపోవటంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ముందు జాగ్రత్తగా ఆలయం వద్ద పోలీసులు మొహరించారు. మరోవైపు తాను సవాలు విసిరింది ఎంపీ విజయసాయిరెడ్డికి అని... ఆయన వస్తేనే తానూ ప్రమాణం చేస్తానని వెలగపూడి స్పష్టం చేశారు. ఎంపీ సవాల్ స్వీకరించకుండా అందరితో మాట్లాడిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి