‘కొవిడ్’ పేరుతో రైల్వే బోర్డు ఇష్టానుసారంగా ధరల్ని పెంచేసింది. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లో కొన్ని ప్రత్యేక కేటగిరీల్లో రైళ్ల(special categories trains)ను నడిపారు. ప్రత్తుతం ఆ కేటగిరీలు రద్దయినప్పటికీ అప్పటి బాదుడునే ఇప్పటికీ కొనసాగిస్తూ జనంపై అధిక భారం మోపుతున్నారు(special train tickets heavy burden on the passengers). విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా 294, విశాఖ మీదుగా 153 రైళ్లు ప్రతీవారం రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలోని 80% పైగా రైళ్లలో అదనపు ధరలను కొనసాగిస్తున్నారు. కొవిడ్ మొదటి విడత సమయంలో వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన కార్మికుల్ని తరలించేందుకు ఒక్కో టికెట్‌పై రూ.100 నుంచి రూ.150 అదనపు ధరలతో ‘కొవిడ్ స్పెషల్’ పేరుతో కొన్ని రైళ్లను నడిపారు. తర్వాత కొవిడ్ తీవ్రత తగ్గినా.. పండగలు, సెలవులు, సమ్మర్ పేరిట మరిన్ని స్పెషళ్లను తెచ్చారు.
వీటిలోనూ టికెట్ల ధరలను మూడురెట్ల దాకా పెంచారు. రెండో విడతలో కొవిడ్ ప్రభావం తగ్గాక... దాదాపు అన్ని రైళ్లను కేవలం ‘స్పెషల్’ కేటగిరీకి మార్చారు. ధరలను తగ్గించకుండా... ‘స్పెషల్ రైళ్లు’(special trains) అనిచెప్పి పాత కేటగిరీల రేట్లనే కొనసాగిస్తున్నారు.
శత శాతం ఆక్యుపెన్సీ ఉంటే..
కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో 100% ఆక్యుపెన్సీతో నిండుగా నడుస్తున్న రైళ్లను కచ్చితంగా రెగ్యులర్(సాధారణ రోజుల్లో ఎలా తిరుగుతాయో అదే కేటగిరీలో) చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ... విశాఖ, విజయవాడ మీదుగా తిరిగే రైళ్లపై పెద్దగా ఆలోచనలు చేయడంలేదు.
‘మా చేతుల్లో ఏమీ లేదు’
రైళ్ల కేటగిరీలు మారినా టికెట్ల ధరలు తగ్గలేదని రైల్వే అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. వాటి నిర్ణయం తమ చేతుల్లో ఉండదని, పూర్తిగా రైల్వే బోర్డు చూసుకుంటుందని వెల్లడిస్తున్నారు. కొవిడ్ కారణంగా రైళ్ల నిర్వహణభారం బాగా పెరిగిందని చెబుతున్నారు. కొవిడ్ రాకముందే స్లీపర్ టికెట్‌కు 200 కి.మీ. దూరానికి వసూలు చేసే మొత్తాన్ని మినిమంగా నిర్ణయించారని, అందుకే విశాఖ-అనకాపల్లి, విశాఖ-విజయనగరం మధ్య టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.
- కొవిడ్ రాని... సాధారణ రోజుల్లో విజయవాడ-విశాఖ(350 కి.మీ.) మధ్య స్లీపర్‌కు రూ.205, జనరల్‌కు రూ.121 ఉండేది. ప్రస్తుతం విశాఖ-కొల్లాం రైలులో వెళ్తే స్లీపర్ టికెట్ ధర రూ.225 తీసుకుంటున్నారు. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తే మాత్రం రూ.385 వసూలు చేస్తున్నారు. అలాగే స్పెషల్ రైళ్లో సెకండ్ సిట్టింగ్ ధర రూ.140 ఉండగా ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో రూ.165 తీసుకుంటున్నారు. చాలా రైళ్లలో 3ఏసీ ధరల్నీ రెండింతలు పెంచేశారు.
- విశాఖ-అనకాపల్లి మధ్యదూరం 33 కి.మీ. అయితే విశాఖ-విజయవాడ మధ్య ఎంతైతే వసూలు చేస్తున్నారో... అనకాపల్లికీ దాదాపు అంతే వసూలు చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో అనకాపల్లికి స్లీపర్ ఎంత టికెట్ ఉందో (రూ.385), విజయవాడకూ అంతే ఉంది.
- విశాఖ-విజయనగరం మధ్య 67 కి.మీ దూరానికి స్లీపర్ స్పెషల్ ధర రూ.145 ఉండగా, కొన్ని రైళ్లలో రూ.385 నుంచి రూ.415 వరకు వసూలు చేస్తున్నారు.
- సికింద్రాబాద్ రూట్‌లో భారీ వ్యత్యాసాలు లేకున్నా... ప్రత్యేక రైళ్ల మధ్యే ధరల తేడాలు బాగా కనిపిస్తున్నాయి. పలు రైళ్లలో రూ.30 నుంచి రూ.450 వరకు అదనంగా ఛార్జీలున్నాయి.
ఇదీ చదవండి..
CM Jagan: 'సచివాలయాలను డిసెంబరు నుంచి సందర్శిస్తా'