విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్.కె మీనా సభ్యులుగా ఉన్న హై పవర్ కమిటీ రెండో రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
తెదేపా
అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంలో హై పవర్ కమిటీ సమావేశం జరిగిందని, బాధిత గ్రామాలకు దూరంగా కమిటీ సమావేశం నిర్వహించారని తెదేపా నేత, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీ గణబాబు అన్నారు. ఈ సమావేశానికి గ్రామస్థులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం అవడం లేదన్నారు. కోట్ల రూపాయలు నష్ట పరిహారం ఇచ్చినా బాధిత గ్రామాలలో సంతృప్తి లేదని, అందుకే కట్టుదిట్టమైన భద్రత మధ్య హై పవర్ కమిటీ సమావేశం నిర్వహించారన్నారు. పూర్తి సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, శాశ్వత ప్రాతిపదికన బాధితులను ఆదుకోవాలని గణబాబు హై పవర్ కమిటీని కోరారు.
కాంగ్రెస్
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని కాంగ్రెస్ ప్రతినిధులు హై పవర్ కమిటీని కోరారు. పరిశ్రమపై ఆధారపడిన వారి కోసం ఎల్జీ పరిశ్రమకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థను ఇక్కడ నడపాలని సూచించారు. ఈ ఘటన వల్ల మేఘాద్రి గడ్డ రిజర్వాయర్‌లోని నీరు కొంత మేర కలుషితమైందని కమిటీకి విన్నవించారు.
సీపీఐ
సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినా... మీటింగ్‌కు వెళ్లకుండా అడ్డుపడ్డారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి ఆవేదన చెందారు. పోలీస్ వలయంలో హై పవర్ కమిటీ సమావేశం నిర్వహించారన్నారు. 14 మంది మృతికి కారణమైన కంపెనీపై ఏ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ఇప్పటికీ చెప్పకపోవడం దారుణమన్నారు.