కరోనా కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కూలీలు, అభాగ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తూ ఆహారం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.
విశాఖలో
విశాఖ జిల్లా అనకాపల్లిలో రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లింలకు దాతలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. దాదాపు 100 కుటుంబాలకు దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొరిబిల్లి రమేష్ ఆధ్వర్యంలో సహాయం అందించారు.
తూర్పుగోదావరిలో
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 550 మంది వికలాంగులకు ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చేతుల మీదుగా వీటిని అందించారు.
పారిశుద్ధ్య సిబ్బందికి సహాయం
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో లాక్డౌన్లో సేవలందిస్తున్న వందమంది పారిశుద్ధ్య సిబ్బంది, నిరుపేదలకు శ్రీజ విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో మహిళలు సహాయం అందించారు. వ్యక్తిగత దూరం పాటిస్తూ.. నిత్యావసరాలు, గుడ్లు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.