ఆయనో కీలక రాజకీయ నేత. తనకు సన్నిహితంగా ఉన్న వారి కోసం ఏకంగా ఓ రోడ్డే వేయిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అది కూడా ప్రజాధనంతో. ప్రతిపాదన రాగానే తక్షణం జీవీఎంసీ(విశాఖ నగరపాలక సంస్థ) రోడ్డు మంజూరు చేసింది. పనుల్ని వేగంగా చేస్తోంది. 'నెలల తరబడి కార్యాలయల చుట్టూ తిరిగినా మా వీధికి రోడ్డు, కాలువలు రాలేదు.. ఇళ్లేవీ లేకున్నా ఆ వీధిలో ఇంత హడావుడిగా రోడ్డేస్తున్నారేమిటీ' అని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రోడ్డెక్కడో తెలుసా.. విశాఖలోని సాగర్‌నగర్ ఇస్కాన్ ఆలయం సమీపంలో..!
తీరానికి అభిముఖంగా, ఇస్కాన్ ఆలయ సమీపంలో చాలావరకు ఖాళీ స్థలాలున్నాయి. తాజాగా జీవీఎంసీ వేస్తున్న రోడ్డున్న వీధిలో కేవలం రెండే ఇళ్లున్నాయి. శివారు ప్రాంతాల్లో ఏకంగా కాలనీలు వెలసినచోట కూడా ఇప్పటికీ మౌలిక వసతులు లేవు. కానీ రెండే ఇళ్లున్న ఈ వీధిలో మాత్రం ఏకంగా సీసీ రోడ్డు, కాలువలు వేస్తున్నారు. ఇందుకోసం జీవీఎంసీ రూ.43లక్షలపైనే నిధులు వెచ్చిస్తోంది. నెలరోజులుగా పనులు చురుగ్గా జరుగుతుండటంతో 250మీటర్ల మేర ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి. వీధి మరింత పొడవుగా ఉన్నా.. పూర్తిగా వేయకుండా మధ్యలోనే వదిలేశారు. ఈ రోడ్డుకు అనుబంధంగా బీచ్‌రోడ్డులో తాజాగా కల్వర్టునూ కడుతున్నారు. మరికొన్నాళ్లలో ఈ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తుంది.
రెండేసి టెండర్లు..