మహావిశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలు ప్రధాన పార్టీలకూ సవాలుగా మారాయి. ఎన్నిక వాయిదాపడి.. ఏడాది తరువాత తిరిగి ఆ ప్రక్రియ మొదలైనా.. చాలా వార్డుల్లో తమ పార్టీ ప్రధాన అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. చాలా పేర్లు ప్రచారంలో ఉన్నా..అధికారికంగా ఏ పార్టీ కూడా ప్రకటన చేయలేదు. కొందరికి మాత్రం బి-ఫారమ్ ఖరారు చేసినా.. చాలామందికి పెండింగ్‌లోనే ఉంచారు. దీనికి..ఆశావహులు ప్రజల్లో ఉంటూ పార్టీకి మేలు చేస్తారనే వాదన ఒక వైపు వినిపిస్తోంది. అప్పుడే ఖరారు చేస్తే వేరు కుంపటి పెడతారు..తర్వాత చూద్దామనే ధోరణి మరో వైపు కనిపిస్తోంది. పలు వార్డుల్లో ఇప్పటికీ కీలక మంతనాలు సాగుతున్నాయి.
సేవా క్రతువు సాగించినా...
- కొవిడ్-19 తీవ్రత నేపథ్యంలో లాక్‌డౌన్ మొదలయ్యాక ఎన్నికల కోడ్ ఎత్తి వేశారు. నామినేషన్ వేసిన నేతలు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే ఉద్దేశంతో వ్యవహరించారు. ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత పక్కాగా సీటు ఖాయం చేస్తారనే నమ్మకంతో.. భారీగానే డబ్బులు ఖర్చు చేసుకున్నారు.
- వార్డుల్లో ఇంటింటికి రేషన్, కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులు..ఇలా తమ శక్తి మేరకు వ్యయం చేశారు. మరికొందరు మరింత ఉత్సాహం చూపి.. కోడి మాంసం, గుడ్లు ఇచ్చారు. ఇంకొందరు మాస్కులు, శానిటైజర్లు పంచారు.
- తమ వెనక ఉన్న శ్రేణుల్ని కాపాడుకునేందుకు రోజు వారీ మరింతగా ఖర్చు పెట్టారు.
రాజకీయం ఎలా మారుతోందంటే..