ఏడాదిక్రితం మధ్యలో ఆగిన ఎన్నికను ఉన్నపలంగా మొదలుపెట్టాలనే ఆదేశాలు వచ్చుంటే.. అధికారులంతా తీవ్ర ఒత్తిళ్లలోకి వెళ్లేవారు. కానీ చాలారోజుల సమయం రావడంతో సవరించుకోవాల్సిన కీలకమైన అంశాల మీద దృష్టి పెడుతున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.
పెండింగ్‌లో నియామకాలు
కొవిడ్ సమయంలో ఒకరిద్దరు ఆర్‌వో, ఏఆర్‌వోలు మరణించారు. ఇంకొందరు స్థానచలనం అయ్యారు. దీంతో 7 పోస్టులు భర్తీ చేయాల్సిఉంది. వీటికోసం జీవీఎంసీ ఎన్నికల అధికారి.. జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశారు. వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
బ్యాలెట్ బాక్సుల సేకరణ
గతేడాది ఎన్నికలకు మెదక్, కరీంనగర్ నుంచి బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. ఇక్కడ ఎన్నికలు వాయిదా పడటం, తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటం వాటిని తిరిగి వెనక్కి పంపారు. ఇప్పుడు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 3 విడతలు పూర్తయ్యాయి. ఆ బాక్సులన్నింటినీ జీవీఎంసీ సేకరించనుంది. నగరానికి 2400 బాక్సులు అవసరమని అధికారులు చెబుతున్నారు. రెండ్రోజుల్లో సేకరణ మొదలవుతుందని వెల్లడిస్తున్నారు.
మరో రెండుసార్లు శిక్షణ
పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు నగరం నుంచి ఒక్క సిబ్బందిని కూడా తీసుకోవట్లేదు. మొత్తం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచే ఎంపిక చేస్తున్నారు. గతేడాది వీరందరికీ ఒకసారి శిక్షణ పూర్తయ్యింది. ఇప్పుడు వీరందరికోసం జిల్లాలో అక్కడక్కడ 5 కేంద్రాల్ని ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వనున్నారు. ఇవి చాలకపోతే మరో 2, 3 కేంద్రాల్ని పెంచేందుకూ సన్నద్ధమవుతున్నారు.
తిరస్కరణ.. ఇంకా ప్రకటన రాలేదు
గతేడాది నామినేషన్ల పరిశీలనలో 99 నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ లెక్కయితే తేలిందిగానీ.. ఈ 99మందిలో ఎవరెవరు ఉన్నారనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మార్చి 2న ప్రక్రియ మొదలవగానే ముందు వీటిని ప్రకటించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
అందాకా.. భద్రంగా
ఈనెల 2న నగరంలోని ఆర్‌వోలందరూ వారివారి పరిధిలో దాఖలైన నామపత్రాల్ని స్వాధీనం చేసుకుంటారు. అప్పటిదాకా ఆ పత్రాలన్నీ ఆర్మ్‌డ్ గార్డ్ సంరక్షణలోనే ఉంచారు. గతేడాది ఎన్నికలు వాయిదా పడినప్పటి నుంచి 24×7 ఈ నామపత్రాలున్న గదులకు పహారా కాస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి:'సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ... అంతా సహకరించారు'