మాజీ ఎంపీ సబ్బంహరి నివాస ప్రాంగణంలోని నిర్మాణాలను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. 5 అడుగుల మేర రహదారి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ యంత్రాలతో ప్రహరీ సహా నిర్మాణాలను తొలగించారు. శనివారం తెల్లవారుజామునే పోలీసులతో తరలివచ్చిన సిబ్బంది, కూల్చివేతకు సిద్ధమవ్వగా.. సబ్బంహరి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు ప్రయత్నిస్తున్నారంటూ సబ్బంహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ 5 అడుగుల రహదారి మేర కంచె వేశారు.
విశాఖ సీతమ్మధారలోని సబ్బంహరి ఇళ్లు... 4 ప్లాట్లు కలిపి ఐదు అడుగుల రహదారి కోసం స్ధలాన్ని వదిలినట్టుగా ప్లాన్ లో ఉంది. ఈ నాలుగు ప్లాట్లను సబ్బం హరి కొనుగోలు చేశారు. అవతలి వైపు పార్కు ఉండటంతో రహదారి కొనసాగింపు లేదు. దీంతో ఆయన పార్కు ప్రహరీని అనుసంధానిస్తూ వాచ్‌మెన్‌తోపాటు, సందర్శకుల కోసం టాయిలెట్లు నిర్మించారు. రహదారిలో నిర్మాణాలు ఎలా చేపడతారంటూ జీవీఎంసీ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. 4 ప్లాట్లు తనవేనని...ఆ రహదారికి చివరివైపున ఇంకెవరి స్థలాలు లేనందున అది ఎవరికీ ఉపయోగం లేదని సబ్బంహరి అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు.