కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవాలని విశాఖ మహా నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి. సృజన ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. గురువారం జీనీఎంసీ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. ఒకటి నుంచి 8 తరగతులకు రోజు విడిచి రోజు 9, 10 తరగతులకు ప్రతీ రోజూ పాఠశాల నిర్వహించాలన్నారు. పాఠశాల ఆవరణలో కొవిడ్‌పై అవగాహన కల్పించే ఫ్లెక్సీలు ఉంచాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవండి : జీవీఎంసీ కమిషనర్ - కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్ ఓపెన్ న్యూస్
నవంబర్ 2 నుంచి పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జీవీఎంసీ పరిధిలో పాఠశాలలు తెరవడానికి సిద్ధం కావాలని ప్రధానోపాధ్యాయులను విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.జి సృజన ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ...ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.
థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు జరిపి అనుమానం ఉన్న పిల్లలను, ఉపాధ్యాయులను అనుమతించకూడదన్నారు. తరగతి గదులలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, చాక్ పీసులు, రిజిస్టర్లు వంటివి ఒకరి నుంచి మరొకరికి ఇవ్వకుండా చూడాలని అన్నారు. కరచాలం ఎవ్వరూ చేయకూడదన్నారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మొదటి, ఆఖరి పీరియడ్‌లో తప్పని సరిగా కొవిడ్‌పై ప్రత్యేకమైన బోధనలు చేయాలని, క్లాసులో 20 మంది పిల్లలు ఉండే విధంగా ప్రణాళిక చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రతీ రోజూ సాయంత్రం పాఠశాలలో అన్ని తరగతి గదులకు శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ సన్యాసి రావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :డిసెంబర్- జనవరి నాటికి మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ : డా.వేణు కవర్తపు