ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గీతం అప్పీల్...విచారణ 29కి వాయిదా

విశాఖ గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆ విద్యాసంస్థ కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. కూల్చివేత ముందున్న స్థితిని కొనసాగిస్తూ...తమ స్వాధీనంలో ఉన్న క్యాంపస్​ను పరిరక్షిస్తూ ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. ఈ అప్పీల్​ విచారణార్హత లేదని ప్రభుత్వ ఏఏజీ వాదనలు వినిపించారు. ఈ వాదనలకు సమాధానం ఇచ్చేందుకు గీతం తరఫు న్యాయవాదికి సమయం ఇస్తూ...విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Gitam university
Gitam university

By

Published : Oct 28, 2020, 4:55 AM IST

విశాఖలోని గీతం వర్సిటీకి చెందిన కట్టడాల కూల్చివేత విషయంలో ఈ నెల 25న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆ విద్యాసంస్థ కార్యదర్శి మోహనరావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. తమ స్వాధీనంలోని క్యాంపస్​ను పరిరక్షిస్తూ ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. కూల్చివేతకు ముందున్న స్థితిని కొనసాగించాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్​పై విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పిన వాదనలకు సమాధానం ఇచ్చేందుకు గీతం తరపు న్యాయవాదికి వెసులుబాటు ఇస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

గీతం తరపు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ .. ముందస్తు నోటీసు ఇవ్వకుండా హడావుడిగా పోలీసులు , రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు. ఎలాంటి వివరణ తీసుకోలేదన్నారు. తమ స్వాధీనంలోని భూమికి మార్కెట్ ధర చెల్లించేందుకు అంగీకరించామన్నారు . కూల్చివేతల పేరుతో మిగిలిన భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. మూడో వ్యక్తికి ఆ భూమిపై హక్కులు కల్పిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. కూల్చివేతలకు ముందున్న స్థితిని కొనసాగించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. అప్పీల్​కు విచారణార్హత లేదన్నారు. ఇరువైపులా సమ్మతి మేరకే సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారన్నారు. తదువరి కూల్చివేతలొద్దని రెవెన్యూ అధికారులను, ఇకమీదట నిర్మాణాలు చేపట్టవద్దని గీతం యాజమాన్యాన్ని సింగిల్ జడ్జి స్పష్టంచేశారు.

మధ్యంతర ఉత్తర్వుల సమయంలో సమ్మతి తెలియజేసిన గీతం .. ఇప్పుడు అప్పీల్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని తమకు ఇచ్చేయాలని కోరడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం తప్పు ఎలా అవుతుందని.. అత్యవసరం ఉందన్న కారణంగా సింగిల్ జడ్జి దసరా పండగ రోజు ఇంటి వద్ద ఈ వ్యవహారంపై విచారణ జరిపారని తెలిపారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం .. ఏఏజీ వాదనలకు తిరిగి సమాధానంగా వాదనలు వినిపించేందుకు పిటిషనర్ తరపు న్యాయవాదికి సమయం ఇస్తూ విరారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి :నేడు...వివిధ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

ABOUT THE AUTHOR

...view details