గిరిజనాన్ని ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాటిపై అడవిబిడ్డలు ఆందోళనలకు దిగుతున్నారు. తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లడంతో గిరిజనం సంఘటితమై సర్కారుపై పోరుబాట సాగిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక గిరిజన జనాభా ఉన్న విశాఖ మన్యం ఇందుకు వేదికగా నిలుస్తోంది. అక్టోబరు 24న గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని వేలమంది ముట్టడించారు. ఈ నిరసనలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐటీడీఏ పీవో మెమోలు జారీచేశారు. అయినా 27న మరోసారి ఏపీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజనులంతా తిరుగుబావుటా ఎగరేశారు. ఇంతకీ వారి పోరాటం ఎందుకంటే..
గిరిజన తెగలో 33 ఉపతెగలు ఉంటాయి. దరఖాస్తు సమయంలో వాటిని నమోదుచేయాలి. ఈ ఏడాది ఆగస్టులో పిల్లలను పాఠశాలల్లో చేర్పించినప్పుడు చైల్డ్ ఇన్ఫో డేటాలో ఎస్టీ ఉపతెగల్లో వాల్మీకి తెగ లేదు. ఇది ఆ తెగ పిల్లల ప్రవేశాలకు అడ్డంకిగా మారింది. దీనిపై గిరిజన సంఘాలు పోరాడటంతో కొన్నాళ్లకు ఆ తెగను అనుసంధానించారు. సెప్టెంబరులో వెబ్‌సైట్ నుంచి భగత, గవుడు తెగలు మాయమయ్యాయి. ఆయా తెగలవారు ప్రభుత్వ సంక్షేమపథకాలకు దరఖాస్తు చేయడానికి వీల్లేకుండా పోయింది. వీటిపైనా ఆందోళనలు చేయగా తర్వాత పునరుద్ధరించారు. గతంలో ఎప్పుడూ ఇలా లేదని, ఒకసారి అంటే పొరపాటు అనుకోవచ్చు, అదేపనిగా ఉపతెగలను తొలగించడం వెనక దురుద్దేశం కనిపిస్తోందని ఏపీ ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర ఆరోపిస్తున్నారు.
బడులకు దూరం..
గిరజన సంక్షేమశాఖ పరిధిలో ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒప్పంద గురుకుల ఉపాధ్యాయుల (సీఆర్టీ) సర్వీసులను పునరుద్ధరించలేదు. దీంతో కొన్నిచోట్ల వారు విధులకు దూరమయ్యారు. సీఆర్టీలపైనే ఆధారపడి నడిచే వందల ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. విశాఖ జిల్లాలోనే 139 సర్కారీ బడులు మూతపడడంతో వాటి పరిధిలో బాలలు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మరో 122 ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీల సేవలను పునరుద్ధరించకపోవడంతో బోధన కుంటుపడింది. రెండురోజుల క్రితం పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా ఇదే విషయాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్పశ్రీవాణి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 1700 మంది సీఆర్టీల సేవలను పక్కన పెట్టి గిరిజన బాలలకు విద్యను దూరం చేస్తున్నారని గిరిజన సంఘం నేత అప్పలనర్స ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.