ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి - visakha gas leak news

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరువక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటన విషాదం నింపింది. పరవాడ ఫార్మా సిటీలో రసాయన వాయువు ఇద్దరి ఆయువు తీయగా...వెంటనే లీకేజ్​ను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాద తీవ్రతను కట్టడి చేయగలిగారు. గ్యాస్‌ లీకేజీ ఘటన పరిశ్రమల భద్రతా ప్రమాణాలను మరోసారి ప్రశ్నార్థకం చేస్తూ ఆందోళన కలిగిస్తోంది.

Gas Leakage in sainor pharama company in viskhapatnam
సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్

By

Published : Jun 30, 2020, 5:58 PM IST

విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో జరిగిన గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ఇద్దరిని బలి తీసుకుంది. సోమవారం రాత్రి 11గంటల 30 నిమిషాల సమయంలో సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ ట్యాంక్​లోకి హెచ్డీఎస్ గ్యాస్​ను పంపిస్తుండగా లీకైంది. లీకేజీని గుర్తించిన వెంటనే దాన్ని అదుపు చేశారని....ప్రమాద తీవ్రత రియాక్టర్ ట్యాంక్ ఉన్న ప్రదేశానికి మాత్రమే పరిమితం చేయగలిగారని అధికారులు చెబుతున్నారు. హోస్ట్ పైప్ సరిగా బిగించకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగినప్పుడు 12 మంది ఉండగా... ఆరుగురు గ్యాస్ పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన నలుగురు చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి జగన్‌ అస్వస్థతకు గురైనవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఎఫ్ఐఆర్ నమోదు...

పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నరేంద్ర, విజయనగరానికి చెందిన గౌరీశంకర్ ఉన్నారు. నరేంద్ర షిఫ్ట్ ఇంఛార్జ్​గా పని చేస్తుండగా... గౌరీ శంకర్ కెమిస్ట్​గా ఆ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. గౌరీ శంకర్​కు ఈ ఏడాది ఏప్రిల్​లోనే వివాహమైంది. భార్య ప్రస్తుతం గర్భవతి. తమ కుటుంబానికి తీరని శోకమంటూ కేజీహెచ్ మార్చురీ వద్ద అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ప్రమాదంపై కమిటీ ఏర్పాటు...
ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే కలెక్టర్ వినయ్​చంద్, పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకేజీని పూర్తిగా కట్టడి చేసే వరకు అక్కడే ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. జేసీ3 గోవిందరావు ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీ ప్రమాద కారణాలపై నివేదిక ఇవ్వనుంది. నివేదిక వచ్చే వరకు ఈ పరిశ్రమను మూసివేయాల్సిందిగా సీఎం జగన్ అధికారులకు ఆదేశించినట్లు స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజా వెల్లడించారు. సైనార్ కంపెనీ లో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే ఈ దుర్ఘటన జరిగిందన్నారు.

కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి: తెదేపా నేత

బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీ సందర్శనకు వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డగించటంతో నిరసన చేపట్టారు. తెదేపా నేతలతో కలిసి ధర్నాకు దిగిన బండారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫార్మా సిటీలో నిత్యం వేల మంది పని చేస్తుంటారు. ఈ సిటీని ఆనుకుని తాడి, తానం, లెమర్తి గ్రామాలు ఉన్నాయి. ప్రమాదాలు చేయి దాటితే వేల మంది ప్రజలపై దాని ప్రభావం ఉంటుంది. సైనార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మూడేళ్ల క్రితం ఒక రియాక్టర్ పేలిన ఘటనలోనూ ప్రాణ నష్టం జరిగింది. పరిశ్రమలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నా... ఆ దిశగా దృష్టి సారించకపోవడం వల్లే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

ఇవీ చదవండి:పెళ్లై కొద్ది నెలలే.. అంతలోనే విషవాయువు మింగేసింది

ABOUT THE AUTHOR

...view details