విశాఖపట్నం సమీపంలోని గంగవరం పోర్టు పూర్తిగా అదానీ గ్రూపు ఆధీనంలోకి వచ్చింది. ఈ పోర్టు కంపెనీలో ప్రమోటర్ అయిన డీవీఎస్ రాజు కుటుంబానికి ఉన్న 58.1% వాటాను అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజడ్ లిమిటెడ్ రూ.3,604 కోట్లకు కొనుగోలు చేసింది. గంగవరం పోర్టు కంపెనీలో విదేశీ సంస్థ అయిన వార్‌బర్గ్ పింకస్‌కు ఉన్న 31.5% వాటాను ఇటీవల అదానీ పోర్ట్స్ సంస్థ రూ.1,954 కోట్లకు కొన్న విషయం విదితమే. తాజాగా డీవీఎస్ రాజు వాటానూ సొంతం చేసుకోవడంతో గంగవరం పోర్టు కంపెనీలో 89.6% వాటా అదానీ గ్రూపు చేతికి వచ్చినట్లు అవుతోంది. ఇక మిగిలిన 10.4% వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. గంగవరం పోర్టు ఏపీలోని రెండో అతి పెద్ద నాన్-మేజర్ పోర్టు. రాష్ట్ర ప్రభుత్వంతో 2059 వరకు కన్సెషన్ ఒప్పందం కింద ఈ పోర్టును డీవీఎస్ రాజు ఆధ్వర్యంలోని గంగవరం పోర్టు కంపెనీ అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది. దాదాపు 1800 ఎకరాల్లో 9 బెర్తులతో రూపుదిద్దుకున్న ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. 2 లక్షల డీడబ్ల్యూటీ పరిమాణంలోని భారీ సరకు రవాణా ఓడలూ ఈ పోర్టుకు రాకపోకలు సాగించే వీలుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం, స్టీలు ఈ పోర్టు నుంచి ఎక్కువగా రవాణా అవుతున్నాయి.
రూ.500 కోట్ల నగదు నిల్వలు
గత ఆర్థిక సంవత్సరంలో గంగవరం పోర్టు 3.45 కోట్ల టన్నుల సరుకు రవాణా చేసి రూ.1,082 కోట్ల ఆదాయాన్ని, రూ.516 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ చేతిలో రూ.500 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. సరకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా గంగవరం పోర్టును కొన్నట్లు అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. ఈ పోర్టు సామర్థ్యాన్ని 25 కోట్ల టన్నులకు విస్తరించే అవకాశం ఉందని, తద్వారా తూర్పు తీరం సత్వర పారిశ్రామికీకరణకు వీలు కలుగుతుందని వివరించారు.