ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తల్లి, తండ్రి, తమ్ముడి హత్య.. పొగ తీవ్రతకు నిందితుడి మరణం

నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని... పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చెప్పించిన తండ్రిని కన్నకొడుకే పొట్టన పెట్టుకున్నాడు. తమ్ముడినీ హతమార్చాడు. చివరకు తానూ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుమారుడు తప్ప మిగిలిన వారి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని నగర పోలీసు కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా ప్రకటించారు.

తల్లి, తండ్రి, తమ్ముడి హత్య
తల్లి, తండ్రి, తమ్ముడి హత్య

By

Published : Apr 16, 2021, 5:38 AM IST

Updated : Apr 16, 2021, 6:00 AM IST

తల్లి, తండ్రి, తమ్ముడి హత్య

విశాఖపట్నం శివారు మధురవాడ మిథిలాపురి కాలనీ ఆదిత్య ఫార్చూన్‌ టవర్స్‌ సి-బ్లాక్‌ ఫ్లాట్‌ నెంబరు 505లో సుంకరి బంగారునాయుడు(50) తన కుటుంబంతో ఉంటున్నారు. 20 ఏళ్లపాటు బహ్రెయిన్‌లో ఉండి.. మూడేళ్ల క్రితమే విశాఖ వచ్చారు. ఆయన భార్య నిర్మల (45) హోమియో వైద్యురాలు. పెద్దకుమారుడు దీపక్‌ (25) వరంగల్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌ చదివి, దిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకుని, కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్నకుమారుడు కశ్యప్‌(19) ఇంటర్‌ చదువుతున్నాడు.

తెల్లవారుజామున అరుపులు.. పొగ
గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల తర్వాత బంగారునాయుడి ఫ్లాట్‌ నుంచి అరుపులు వినిపిస్తున్నాయని ఓ మహిళ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో భద్రతాసిబ్బంది వెళ్లి చూసి.. అప్పటికి ఏమీ లేకపోవడంతో కిందికి వచ్చేశారు. నాలుగు గంటలకు ఫ్లాట్‌ నుంచి పొగలు వస్తున్నాయని గుర్తించి మళ్లీ ఆమే గ్రూపులో పెట్టారు. మరికొందరు కూడా లేచి.. 505 ఫ్లాట్‌ దగ్గరకు వెళ్లి చూశారు. అగ్నిప్రమాదమని భావించి అందరూ కిందికి వచ్చేశారు.

అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. తలుపులు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో వాటిని బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఫ్లాట్‌ లోపలికి వెళ్లిన అగ్నిమాపక అధికారులు నివ్వెరపోయారు. పొగ, మంటలు ఉన్నా.. ప్రధానద్వారం పక్కనే బంగారునాయుడి మృతదేహం పడి ఉంది. హాల్లోనే మరోచోట డాక్టర్‌ నిర్మల మృతదేహం బోర్లా పడి ఉంది. లోపల గదిలో కశ్యప్‌ మృతదేహం వెల్లకిలా నగ్నంగా పడి ఉంది. అతని శరీరంపై పలు గాయాలున్నాయి. నిర్మల మృతదేహంపైనా గాయాలు కనిపించాయి. బంగారునాయుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. ఆయన పారిపోవడానికి ప్రయత్నించినట్లు అక్కడి దృశ్యాలను బట్టి అర్థమవుతోందని పోలీసులు అంటున్నారు.

సూటుతో ముస్తాబై.. కుప్పకూలిన దీపక్‌
బంగారునాయుడు, నిర్మల, కశ్యప్‌ మృతదేహాలపై గాయాలుండగా... దీపక్‌ మాత్రం సూట్‌, టై ధరించి ముస్తాబైనట్లు పోలీసులు గుర్తించారు. అతని శరీరంపై గాయాలేమీ లేవు. ఈ విషయం ఆధారంగానే మిగిలిన ముగ్గురినీ దీపక్‌ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురినీ హతమార్చి.. తగలబెడదామన్న ఆలోచనతో ఇంట్లో నిప్పంటించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పొగ తీవ్రంగా రావడంతో అతను ఉక్కిరిబిక్కిరై మృతిచెంది ఉంటాడని చెబుతున్నారు. తనను తాను కాపాడుకోవడానికి పంపు తిప్పాడని, అనంతరం అక్కడే మృతి చెందాడన్నారు.

సాక్ష్యాలు చెల్లాచెదురు
ఫ్లాట్లో దట్టంగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది నీళ్లు కొట్టారు. దీంతో హత్యలకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు చెల్లాచెదురైనట్లు తెలుస్తోంది. కానీ మృతదేహాలపై ఉన్న గాయాల ఆధారంగా అవి హత్యలేనని పోలీసులు తేల్చారు.

సౌమ్యుడు.. తెలివైనవాడే
దీపక్‌ చిన్నప్పటి నుంచి బహ్రెయిన్‌లోనే చదివాడు. స్పోర్ట్స్‌ బైకు, ఖరీదైన కారులో.. ఇలా అనేక ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఉంచాడు. చాలా సౌమ్యంగా ఉండేవాడని, తెలివైనవాడని బంధువులు చెబుతున్నారు. అతడు ఈ హత్యలు చేసి ఉండకపోవచ్చని అంటున్నారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు దీపక్‌ ఎంపికయ్యారు.

కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది

ఈ హత్యలకు కుటుంబ వివాదాలే కారణం కావొచ్చని తెలుస్తోంది. బుధవారం రాత్రి 8.56 తర్వాత వారి ఫ్లాట్‌కు ఎవరూ వెళ్లిన దాఖలాలు లేవు. దీపక్‌ మృతదేహంపై గాయాలేమీ లేవు. ఇంట్లో వ్యాపించిన పొగ వల్లే అతడు మరణించినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్‌ నిపుణులతో తనిఖీ చేయించాం. అతను మానసిక సమస్యలతోనో, కుంగుబాటుతోనో బాధపడుతూ ఉండవచ్చు. బయటి వ్యక్తుల ప్రమేయంపై ఆధారాల్లేవు. అపార్టుమెంటు మొత్తం నిఘా కెమెరాలున్నాయి. ఇతరులు వచ్చి హత్య చేయడానికి అవకాశం కనిపించడం లేదు. వారి బంధువులనూ విచారించాక.. మరిన్ని విషయాలు తెలియొచ్చు.

- మనీశ్‌కుమార్‌ సిన్హా, పోలీసు కమిషనర్‌

లోపల ఏం జరిగింది..?

కుటుంబమంతా మరణించడంతో.. హత్యలకు కారణమేంటో తెలియట్లేదు. ఇంట్లో సీసీ కెమెరాలు లేవు. నిర్మల, కశ్యప్‌ ప్రతిఘటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తులతో పొడవడంతో ప్రాణరక్షణ కోసం కుటుంబసభ్యులు పరుగెత్తినట్లు తెలుస్తోంది. ఫ్లాట్‌ గోడలపైనా, నేలపైనా, కప్‌బోర్డ్‌ల తలుపులపైనా రక్తపు మరకలు ఉన్నాయి. గదుల్లోనూ, మంచంపైన బియ్యం గింజలు ఉండటంతో ఏమైనా క్షద్రపూజలు జరిగాయా అన్న కోణంలో పోలీసులు ఆరాతీశారు. బియ్యం పోసి కేసును పక్కదారి పట్టించడానికి దీపక్‌ ప్రయత్నించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంట్లో అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణం కావొచ్చని పోలీసులు భావించారు. అయితే ఏసీ బాగా కాలిపోవడం అనుమానం కలిగించింది. కుటుంబసభ్యులను తగలబెట్టడానికి ప్రయత్నిస్తే నేలపై ఉన్న వస్తువులు కాలిపోతాయి. కానీ ఏసీ ఎందుకు కాలిందన్నదే అర్థం కాలేదు. విద్యుదాఘాతం జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

ఇదీ చదవండీ... చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక

Last Updated : Apr 16, 2021, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details