కేంద్ర, రాష్ట్రాల్లో ప్రశ్నించే ప్రతిపక్షాలు కావాలి Former Vice President Venkaiah Naidu కేంద్రంలో శక్తిమంతమైన, సమర్థుడైన ప్రధాని ఉన్నారని, స్థిరమైన ప్రభుత్వం ఉందని.. దానికి తగ్గట్లుగా సమర్థమైన ప్రతిపక్షం ఉండాలని తాను భావిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం విశాఖలో మిత్రులు ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సమావేశం’లో ఆయన మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రెండుచోట్లా ప్రశ్నించే ప్రతిపక్షాలు కావాలన్నారు. ‘ప్రశ్నించడానికి కావాల్సిన నైతిక శక్తి ఉన్న ప్రతిపక్షం కావాలి. ప్రత్యామ్నాయం చూపించేది కావాలి. అది కాదు.. ఇది చేస్తే మంచిది అని చెప్పే ప్రతిపక్షాల అవసరం రెండుచోట్లా ఉంది.. అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అవి ఉన్నప్పుడే రెండోవైపు అభిప్రాయం తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
తెలుగు ప్రజల పాలన ఇంగ్లిషులో!
మాతృభాషలో మాట్లాడేందుకు గర్వించాలని, రాజ్యసభ సభ్యులు మాతృభాషలో మాట్లాడగలిగేలా అవకాశం కల్పించడానికి కృషి చేశానని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. తెలుగు ప్రజల పరిపాలన ఇంగ్లిషులో జరుగుతోందన్నారు. ‘తెలుగులో ప్రతి (కాపీ) ఇస్తున్నాం కదా. తెలుగును ఒక భాషగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాం కదా’ అంటున్నారని అన్నారు. మిగతా వాటిని ఒక భాషగా నేర్చుకునే అవకాశం కల్పించాలని.. తెలుగు బోధనా భాషగా, పరిపాలన భాషగా ఉండాలన్నారు. తన ఎదుగుదలకు తన మిత్రులే కారణమని వెంకయ్య చెప్పారు. వారు ఎంతో ఆదరణ చూపేవారని తెలిపారు. అందుకే అన్ని ప్రాంతాలూ తిరిగి తన మిత్రులను పలకరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిజోరం గవర్నర్ కె.హరిబాబు, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్ తదితరులు వెంకయ్యనాయుడితో తమ అనుభవాలను పంచుకున్నారు.
ఇవీ చదవండి: