విశాఖలో తొలి ఎస్‌జీఎస్‌టీ కేసు నమోదు
రాష్ట్ర వస్తు సేవల పన్ను(ఎస్‌జీఎస్‌టీ) చట్టం ప్రకారం విశాఖలో మొట్టమొదటి కేసు నమోదైంది. గాజువాక సర్కిల్ పరిధిలోని శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని రూ.2.60 కోట్ల పన్ను ఎగవేసినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
రాష్ట్ర వస్తు సేవల పన్ను(ఎస్‌జీఎస్‌టీ) చట్టం ప్రకారం విశాఖలో తొలి కేసు నమోదైంది. విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో గాజువాక సర్కిల్ పరిధిలోని శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని దుడ్డు శేఖర్‌ను అరెస్ట్ చేసి జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు నిందితుడు శేఖర్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడు శేఖర్‌ను కేంద్ర కారాగారానికి తరలించారు. పాత ఇనుము వ్యాపారం చేయడానికి గాజువాక సర్కిల్‌లో రిజిస్ట్రేషన్ పొందిన శేఖర్ ఆన్లైన్ వేబిల్లులను దుర్వినియోగం చేశాడు. రూ.14.40 కోట్ల టర్నోవర్‌పై చెల్లించాల్సిన రూ.2.60 కోట్ల పన్ను ఎగవేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తరహాలోనే మరికొందరు వ్యాపారస్థులు రూ.10 కోట్ల వరకు పన్ను ఎగవేసి ఉండవచ్చని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పీయూష్ కుమార్ వెల్లడించారు.