ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గాడి తప్పిన ‘ఫాస్టాగ్‌’ వరుసల నిర్వహణ...టోల్‌గేట్ల వద్ద తప్పని నిరీక్షణ

రాష్ట్రంలో ఫాస్టాగ్‌ వరుసల నిర్వహణ అధ్వానంగా ఉంది. వాహనదారులకు టోల్‌గేట్ల దగ్గర నిరీక్షణ తప్పట్లేదు. రాష్ట్రంలోని మెుత్తం 43 టోల్‌గేట్లు ఉండగా...ఫాస్టాగ్ లేకుండా 25 శాతం వాహనాలు ప్రయాణిస్తున్నాయి.

Fastag‌ rows management poor in ap
గాడి తప్పిన ‘ఫాస్టాగ్‌’ వరుసల నిర్వహణ

By

Published : Nov 13, 2020, 12:38 PM IST

టోల్‌గేట్ల వద్ద వాహనదారుల విలువైన సమయం వృథా కాకుండా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తీసుకొచ్చిన ‘ఫాస్టాగ్‌’ విధానం కొన్ని చోట్ల పకడ్బందీగా అమలు కావడం లేదు. ఈ వినియోగ రుసుం చెల్లింపు కేంద్రాల (టోల్‌గేట్లు) వద్ద సునాయాసంగా వెళ్లిపోవచ్చని భావించి ఫాస్టాగ్‌ వైపు మళ్లిన వాహనదారుల అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులవుతున్నాయి. ఫాస్టాగ్‌ ఉన్న వాహనాల రాకపోకలకు వీలుగా టోల్‌గేట్ల దగ్గర ప్రత్యేక వరుసలు (డెడికేటెడ్‌ లైన్స్‌) అందుబాటులో ఉంటాయని... నగదు చెల్లించేవారికి ఒక మార్గం మాత్రమే అందుబాటులో ఉంచుతామని అధికారులు ప్రకటించారు. కొంతకాలంపాటు ఆ విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. నగదు చెల్లింపు వరుసలో వాహనాలు బారులు తీరుతున్నాయన్న ఉద్దేశంతో ఆయా వాహనాలను కూడా ప్రత్యేక ఫాస్టాగ్‌ వరుసల్లోకి ఇష్టారాజ్యంగా అనుమతించేస్తున్నారు. ఫలితంగా ‘ఫాస్టాగ్‌’ వారు కూడా టోల్‌గేట్ల దగ్గర నిరీక్షించక తప్పడంలేదు. దీంతో ఈ వ్యవస్థ లక్ష్యమే దెబ్బతినే దుస్థితి కనిపిస్తోంది.

పరిస్థితి ఏమిటంటే:

*ఫాస్టాగ్‌ లైన్లకు పక్కనే విభాగినులపై నగదు వసూళ్ల క్యాబిన్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. అందులో సిబ్బందిని కూడా యథాతథంగానే ఉంచి అన్ని వరుసల్లోనూ నగదు వసూళ్లకు అనుమతి ఇస్తున్నారు.

*టోల్‌గేట్ల దగ్గర ఫాస్టాగ్‌లు లభ్యమవుతున్నప్పటికీ అవి వినియోగంలోకి రావడానికి రెండు మూడు రోజులు పడుతుండడంతో అప్పటికప్పుడు కొనుగోలు చేద్దామనుకున్నా ఉపయోగం ఉండడంలేదు. దీంతోపాటు దరఖాస్తు పూర్తిచేయడం, వాహన రిజిస్ట్రేషన్‌ వివరాలు, గుర్తింపుకార్డు తదితర వివరాలు ఇవ్వడానికి చాలామంది వాహనదారులు ఆసక్తిచూపడంలేదు.

*టోల్‌గేట్ల వద్ద చెల్లించాల్సిన రుసుముకు సరిపడా మొత్తాన్ని ప్రయాణానికి కనీసం గంట ముందే ఫాస్టాగ్‌లో ఉండేలా సరిచూసుకోవాలి. అప్పటికప్పుడు ఫాస్టాగ్‌కు నగదు బదిలీ చేస్తే ‘బ్లాక్‌లిస్ట్‌’లో ఉన్నట్లు సందేశం వస్తుందన్న విషయంపై చాలామందికి అవగాహన ఉండడంలేదు.

*విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్లే ప్రయాణికులకు ఎక్కువగా ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీపావళి నేపథ్యంలో జరిగే ప్రయాణాల్లోనైనా ఈ సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

శివశంకర్‌

ఫాస్టాగ్‌ లేనివారి కారణంగానే సమస్యలు...

వాహనదారుల్లో సుమారు 25 శాతం మందికి ఫాస్టాగ్‌ ఉండడంలేదు. వారి కారణంగానే ఈ విధానానికి సమస్యలు ఎదురవుతున్నాయి. నగదు చెల్లింపులు చేసే అలాంటి వారి కోసం టోల్‌గేట్ల దగ్గర ఒక్క వరుసలోని మార్గాన్ని మాత్రమే అనుమతిస్తుండడంతో తీవ్రమైన రద్దీ ఏర్పడి వారు చాలా అవస్థలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఫాస్టాగ్‌ వరుసల్లోకి అనుమతించాలని టోల్‌గేట్ల గుత్తేదారులకు సూచించాం. కానీ, కొందరు యథేచ్ఛగా ఫాస్టాగ్‌ వరుసల్లోకి ఇతర వాహనాలను పంపుతున్నారన్న ఫిర్యాదులు మాకు అందాయి. అలాంటి వాటిపై దృష్టిసారించాము. తగిన చర్యలు తీసుకుంటాం.

- శివశంకర్‌, పి.డి., ఎన్‌.హెచ్‌.ఎ.ఐ., విశాఖపట్నం

ఇదీ చదవండి:

నూతన పోలీస్ యూనిట్ల ఏర్పాటుకు పోలీసు శాఖ ప్రతిపాదనలు

ABOUT THE AUTHOR

...view details