ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దళారుల వేషం... ఉద్యోగాలంటూ మోసం!! - విశాఖలో ఉద్యోగాల మోసాలు

విశాఖ నగరంలో.. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలుకొలువుదీరాయి.ఉక్కు కర్మాగారం.. నౌకాశ్రయం..షిప్‌యార్డు.. తూర్పు నావికాదళంవాల్తేరు రైల్వే డివిజన్‌..ఇలా ఎన్నో.. ఇవి గాక ఇంకెన్నో ప్రముఖ సంస్థలున్నాయి. ఎందరో యువత వీటిలో కొలువులకై ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. దళారుల బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. నిరుద్యోగుల ఆశలనే అవకాశంగా మలుచుకొని పలు రూపాల్లో డబ్బులు గుంజేస్తూ మోసగిస్తున్నారు. ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్నఘటనలు బాధిత యువత కుటుంబాలను ఆర్థికంగా చిదిమేస్తున్నాయి.

fake jobs at viahakapatnam
fake jobs at viahakapatnam

By

Published : Dec 18, 2020, 1:46 PM IST

విశాఖ నగరంలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగులను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిలువునా ముంచుతున్నారు. నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నవారు చెబుతున్న మాయమాటలు అన్నీ ఇన్నీ కావు. డబ్బులు కట్టడమే ఆలస్యం అన్నట్లుగా వారిని నమ్మబలికి భారీఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఉక్కు కార్మాగారంలో :

ఉక్కు కర్మాగారంలో దినసరి కార్మికునిగా చేరడానికి కూడా విపరీతమైన డిమాండు ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికుడిగా అవకాశం కల్పిస్తామని చెప్పి కొందరు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఆయా ఉదంతాలపై సీబీఐ కేసు కూడా నమోదు చేసింది.


రైల్వేలో:

తూర్పుకోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ కేంద్రం విశాఖలో ఉంది. దీంతో చాలా మంది రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసగిస్తున్నారు. పోలీసు కేసులు కూడా నమోదు చేశారు.

తూర్పు నౌకాదళంలో:

‘నేను నౌకాదళ ఉద్యోగిని. అనారోగ్యంతో ఉద్యోగ విరమణ చేశా. నా స్థానంలో కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇప్పించుకునే అవకాశం ఉంది’ అని నమ్మబలికిన వ్యక్తి మోసం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.

నౌకాశ్రయంలో:

విశాఖ నౌకాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సైబర్‌ మోసగాళ్లు రంగంలోకి దిగారు. నౌకాశ్రయ అంతర్జాల చిరునామాను పోలివుండేలా నకిలీ అంతర్జాల చిరునామాను సృష్టించారు. ఉద్యోగాలకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని...రుసుములు కూడా వసూలు చేశారు. నౌకాశ్రయ అధికారులు దీనిని గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు మాత్రం దొరకలేదు. ఎంత మంది మోసపోయారన్న విషయం కూడా వెలుగులోకి రాలేదు.

అంతర్జాల చిరునామాలే వేదికలుగా:

ఇటీవలి కాలంలో పలు సంస్థలు ఉద్యోగాల దరఖాస్తుల్ని ఆహ్వానించే బాధ్యతలను ప్రముఖ వెబ్‌సైట్లకు అప్పగిస్తున్నాయి. దీంతో సైబర్‌ నేరగాళ్ల దృష్టి ఆ అంతర్జాల చిరునామాలపై పడింది. అలాంటివి సృష్టించి తమ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి భారీ వేతనాల్ని ఆశగా చూపించి కొందరు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తరువాత ఫోన్‌ చేసి ఎంపికైనట్లు చెప్పి శిక్షణ పేరుతో, సెక్యూరిటీ డిపాజిట్‌ పేరుతో, ఇతర సేవల పేరుతో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు.

జైలు నుంచి విడుదలైనా మళ్లీ:

మోసాల ఘటనల్లో నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేసినా బెయిల్‌పై బయటకు వస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మళ్లీ అదే తరహాలో మోసాలు చేస్తున్నారు. నమ్మకమైన మాటలతో నిండా ముంచేస్తున్నారు. ప్రముఖ సంస్థల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ.. భారీగా వేతనాల్ని అందుకుంటున్న వారు కూడా ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తుండడం గమనార్హం. కేసుల్లో తీర్పులు రాలేదని ఆరోపణలున్న ఉద్యోగులపై యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు పదేపదే మోసాలకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి.

వాస్తవాలు...నిర్ధరించుకోవాలి

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నియామక ప్రక్రియలన్నీ పారదర్శకంగా జరుగుతాయి. అంతర్జాల చిరునామాల్లో వారు నిజంగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారా? లేదా? అన్న విషయాన్ని అభ్యర్థులు అధికారికంగా నిర్ధారించుకోవాలి. ఉద్యోగం ఇవ్వకుండా రకరకాల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తే అనుమానించాలి. బాధితులు సమీప పోలీసుస్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. నిందితులపై నేరం రుజువైతే ఏడు నుంచి పది సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది.

- ఐశ్వర్య రస్తోగి, డీసీపీ-1, విశాఖపట్నం

ఇదీ చదవండి:విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details