ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎక్స్‌ప్రెస్ పార్శిల్‌ రైళ్ల సేవలను ముమ్మరం చేసిన రైల్వేశాఖ - ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్ రైళ్ల సేవలు

లాక్‌డౌన్‌ వేళ... ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్ రైళ్ల సేవలను రైల్వే శాఖ ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా నిత్యావసరాలను చేరవేసేందుకు... ఇప్పటికే గూడ్సు రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ... ఇప్పుడు అవసరమైన స్టేషన్ల నుంచి పార్శిళ్లను తీసుకుని వాటిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. గత వారం రోజులుగా వీటి సేవల్ని వివిధ మార్గాల్లో విస్తరింపజేశారు.

express trains in ap railway
express trains in ap railway

By

Published : Apr 18, 2020, 2:36 AM IST

లాక్‌డౌన్ కారణంగా దేశంలో నిత్యావసరాల సరఫరా గొలుసు తెగిపోకుండా... కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు ప్రతిపాదించింది. ప్రధానంగా... రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం వల్ల... ఏ విధంగా వీటి సరఫరా కుంటుపడకుండా చూడాలన్నది సర్కారుకు సవాల్‌గా నిలిచింది. దీనిని అధిగమించడంలో భారతీయ రైల్వే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు కేవలం భారీ సరకు రవాణాకు మాత్రమే పరిమితమైన గూడ్సు రైళ్లను కొనసాగిస్తూనే.... నిర్దేశిత స్టేషన్ల మధ్య ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ రైళ్లను లాక్‌డౌన్‌ సమయంలో రైల్వే శాఖ నడుపుతోంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సేవల ద్వారా ముఖ్యంగా... మందులు, ఇతర నిత్యావసరాలు, కరోనా నివారణ కిట్లు, మాస్కులు, రసాయనాలు వంటివాటిని రవాణా చేస్తున్నారు. గత వారం రోజులుగా వాల్తేరు డివిజన్‌ పరిధిలో రోజుకు కనీసం రెండు నుంచి మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.... ఇక్కడ లోడింగ్‌ కానీ, అన్‌లోడింగ్‌ కానీ చేస్తున్నాయి.

విశాఖ-సంబల్‌పూర్‌ మార్గంలో మే 2 వరకు రోజు విడిచి రోజు ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీసును అందుబాటులో ఉంచారు రైల్వే అధికారులు. సంబల్‌పూర్‌-విశాఖ నడుమ కూడా మే మూడో తేదీ వరకు రోజు విడిచి రోజు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. విశాఖ-కటక్‌ మధ్య మే మూడో తేదీ వరకు రోజూ పార్శిల్‌ సర్వీసులు నడుస్తాయి. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, ఇచ్ఛాపురం, బ్రహ్మపూర్‌, ఛత్రపూర్‌, బలుగాం, ఖుర్డా రోడ్‌, భువనేశ్వర్‌ స్టేషన్లలో పార్శిళ్లను లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. సికింద్రాబాద్‌-హౌరా మధ్య ఈ నెల 23, 30 తేదీలలో, అలాగే హౌరా-సికింద్రాబాద్‌ల మధ్య ఈ నెల 18,25, మే రెండో తేదీన ఈ ప్రత్యేక పార్శిల్‌ సర్వీస్‌ రైలు నడుస్తుంది.

ఆయా స్టేషన్ల మధ్యలో ఉన్న వ్యాపారులు, రైతులు.... నిత్యావసరాలు, పండ్లు, ఇతర దినుసులు కూడా పంపేందుకు... పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్‌ సునీల్‌ కుమార్‌ సూచించారు. దీని కోసం ఆయా స్టేషన్ల మేనేజర్లను సంప్రదించాలని కోరారు.

ఇవీ చదవండి:ఆ పోస్టుల్ని లైక్​ చేస్తున్నారా? మీకు వార్నింగ్ ఖాయం!

ABOUT THE AUTHOR

...view details