విశాఖ టర్నర్ చౌల్ట్రీ ఆవరణలోని మహారాణిపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని... దేవదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొన్నేళ్లుగా అద్దె చెల్లించడం లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే దేవదాయశాఖకు భవనం అవసరాల నిమిత్తం భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని రెవెన్యూ వర్గాలను దేవదాయాశాఖ అధికారులు కోరారు. దేవదాయశాఖకు చెందిన టర్నర్ చౌల్ట్రీలో... ఆ శాఖ సహాయ, ఉప కమిషనర్ కార్యాలయాలతోపాటు మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయం ఉంది. దేవదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నెలకు 20వేలు రూపాయలు, ఉప కమిషనర్ కార్యాలయం 23వేలు రూపాయలను... చౌల్ట్రీకి అద్దెగా చెల్లిస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయం ప్రతి నెలా 22వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా... కొన్నేళ్లుగా చెల్లించకపోవటంతో దాదాపు 12లక్షల రూపాయల మేర బకాయిలున్నట్టు అధికారులు చెబుతున్నారు. బకాయిలు తీర్చాలని కొన్నాళ్లుగా అడుగుతున్నా రెవెన్యూ వర్గాలు పట్టించుకోలేదని సమాచారం. చౌల్ట్రీలోని దేవదాయశాఖ ఉపకమిషనర్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరటంతో... తహసీల్దార్ కార్యాలయాన్ని ఖాళీ చేయించి అక్కడ ఉపకమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయ స్థలం దేవదాయశాఖకు చెందినదని... దాన్ని హామీగా చూపే అధికారం ఎవరికీ లేదని ఆ శాఖ సహాయ కమిషనర్ శాంతి అన్నారు.