Employees protest on prc : ‘‘కొత్త పీఆర్సీ... కోతల పీఆర్సీ మాకొద్దు, చెల్లించిన 9నెలల మధ్యంతర భృతిని వెనక్కి ఇవ్వాలనడం సిగ్గు సిగ్గు, మాట తప్ప వద్దు.. మడమ తిప్ప వద్దు’’ అంటూ ఉద్యోగుల నినాదాలతో జిల్లా కేంద్రాలు మార్మోగాయి. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛన్‌దార్లు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఆందోళనలతో చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పీఆర్సీపై ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లలేమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు స్పష్టంచేశారు.
కర్నూలులో రోడ్డుపై బైఠాయింపు:కర్నూలులో రివర్స్ పీఆర్సీ జీవోలను తక్షణమే రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ రోడ్డుపై గంటకుపైగా బైఠాయించారు.
జనసంద్రంగా కడప వీధులు: కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లు ధర్నా నిర్వహించారు. నగర వీధుల్లో భారీ ర్యాలీ చేశారు. వచ్చే నెల 7నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ నేతలు ప్రకటించారు. పీఆర్సీపై ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లబోమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు.
అనంతలో అర్ధనగ్న ప్రదర్శన:అనంతపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు కదం తొక్కారు. పండిత పరిషత్ ఉపాధ్యాయులు ‘పి.ఆర్.సి. వద్దు’ అంటూ శరీరంపై రాసుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగుల ఆగ్రహం: చిత్తూరులోని ఎన్జీవో భవనం నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు, పింఛన్‌దారులు కదం తొక్కారు. మహిళా ఉద్యోగులూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు.
నెల్లూరులో ఉద్యమ గీతాలతో ఉత్సాహం:కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించడంతోపాటు... కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ గీతాలు ఆలపించారు.