దేశంలోనే విభిన్న ఆకర్షణలు ఉన్న నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని... డ్రగ్స్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉన్న విశాఖలో... యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. రెండేళ్లలో వివిధ సందర్భాల్లో ప్రమాదకర మాదకద్రవ్యాలు నగరంలో బయటపడ్డాయి. ఓ రేవ్ పార్టీ కోసం తెచ్చిన డ్రగ్స్ పట్టుబడటం 2019లో సంచలనం రేపింది. అప్పటినుంచి డ్రగ్స్ మూలాలపై పోలీసులు నిఘా పెట్టినా... డ్రగ్స్ సరఫరాదారులు చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నారు.
విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు వివరాలను గమనిస్తే.... విద్యార్థుల ద్వారానే డ్రగ్స్ సరఫరా జరుగుతున్న విషయం అర్థమవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరవింద్ వయసు 21 ఏళ్లు. ఈ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకుని విక్రయించే వారిలో మరో ముగ్గురు... 22 ఏళ్లలోపు వారే. అంతర్జాల వేదికల ద్వారా అరవింద్ డ్రగ్స్ సమకూర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్‌కు బానిసైన వారిలో చాలామంది యువతే అని సమాచారం. ఈ విషయాన్ని ముందుగా తల్లిదండ్రులే పసిగట్టాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. స్వీయ నియంత్రణ కోల్పోతే భవిష్యత్తు అంధకారమేనని హెచ్చరిస్తున్నారు.