పోలవరం నుంచి ఎడమ కాలువ వెంట విశాఖకు నేరుగా పైపులైను ద్వారా నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్) తయారీ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఓ ఏజెన్సీతో మహా విశాఖ నగర పాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం గోదావరి జలాలు పురుషోత్తపట్నం ఎత్తిపోతలనుంచి ఏలేశ్వరం రిజర్వాయరుకు, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కాలువలో విశాఖ వరకు తరలిస్తున్నారు. ఈ నీరు మార్గమధ్యంలో ఎక్కువగా లీకేజీల రూపంలో వృథా అవుతుండటంతో పైపులైను ఏర్పాటుకు ప్రతిపాదించారు.
ఇది వరకు ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి విశాఖకు మాత్రమే ప్రత్యేక పైపులైనుకు డీపీఆర్ తయారు చేశారు. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా నేరుగా పోలవరం నుంచే పైపులైను ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మేరకు పాతది రద్దు చేసి కొత్త డీపీఆర్ తయారీకి కార్యాచరణ అమలు చేస్తున్నారు. 220 కి.మీ. దూరం ఉన్న ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.4600 కోట్లు ఖర్చవుతుందనే అంచనా ఉందని జీవీఎంసీ ప్రధాన ఇంజినీరు ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.