ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా కేసుల గురించి ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అనుమానం వ్యక్తం చేశారు. విశాఖలోని కేసులను తొక్కిపెడుతోందన్న వ్యాఖ్యలు నిజమైతే అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరని అన్నారు. పెద్ద సంఖ్యలో కేసులు లేనప్పుడు 2వేల మందికి పైగా వైద్యులు ఎందుకు విధులు నిర్వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
'కరోనా కేసుల విషయంలో నిజాలు దాయొద్దు' - కరోనా కేసులపై తెదేపా నేత అనిత వ్యాఖ్యలు
స్వార్థ ప్రయోజనాల కోసం కరోనా కేసుల విషయంలో అసత్యాలు చెప్పవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కోరారు. విశాఖలో కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. నిర్వహించిన కరోనా పరీక్షలు, నిర్ధరించిన కేసులు, ఐసోలేషన్లో ఉన్న వారి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు, గుంటూరులో భారీగా కేసులున్నా.. వంద మంది డాక్టర్లను కూడా ఎందుకు ఉంచలేదని నిలదీశారు. నిర్వహించిన పరీక్షలు, నిర్ధరించిన కేసులు, ఐసోలేషన్లో ఉన్న వారి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో 50 లక్షల జనాభా ఉంటే.. 800 మందికి మాత్రమే పరీక్షలు చేసినట్లు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం ఉత్తరాంధ్ర ప్రజలను బలి చేయవద్దని ఆమె అన్నారు. అలాగే వలస కూలీలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అనిత అన్నారు. ఆకలి కేకలు భరించలేక పిల్లాపాపలతో పేదలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు.