ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ: గుండెపోటుతో మత్తు వైద్యుడు సుధాకర్ మృతి

By

Published : May 21, 2021, 10:26 PM IST

Updated : May 21, 2021, 11:26 PM IST

మత్తు వైద్యుడు సుధాకర్
గుండెపోటుతో మత్తు వైద్యుడు సుధాకర్ మృతి

22:24 May 21

doctor sudhakar dead taza breaking

విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన మత్తు వైద్యుడు సుధాకర్ గుండెపోటుతో మృతి చెందారు. ఎన్95 మాస్కుల విషయంలో  ప్రభుత్వంపై విమర్శలు, రోడ్డుపై వీరంగంతో గతంలో సుధాకర్ వార్తల్లో నిలిచారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ కేసు నమోదు చేసింది. ఈ అంశంపై విచారించిన హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది.

అసలేం జరిగిందంటే..

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న సుధాకర్.. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు ఎన్-95 మాస్కులు ఇవ్వడం లేదంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని.., ప్రజాప్రతినిధులు సైతం ఆసుపత్రిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌ 8న డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ.. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. 

నిరసన..

సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా... మే 16న విశాఖలో పోర్టు ఆసుపత్రి ఎదుట అర్ధనగ్నంగా.. డాక్టర్ సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా.. అక్కడికి వెళ్లిన పోలీసులు... ఆయన ఎవరో తెలుసుకోకుండానే చేతులు వెనక్కి విరిచికట్టి రోడ్డుపై పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆటోలో కుదేసి పోలీస్ స్టేషన్‌కు.., అక్కడి నుంచి కేజీహెచ్​కు తీసుకెళ్లారు. సుధాకర్‌ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసే సమయంలో వైద్యుడిపై కానిస్టేబుల్‌ కొట్టిన వీడియో బయటికొచ్చింది. మద్యం మత్తులో డాక్టర్ హల్‌చల్‌ చేసినట్టు చెప్పిన విశాఖ సీపీ ఆర్కే మీనా.... వైద్యుడిని కొట్టిన కానిస్టేబుల్‌ను అదే రోజు సస్పెండ్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. 

ఇదీ చదవండి

సుధాకర్ కేసు:  ఎన్​-95 మాస్కుల నుంచి మానసిక ఆసుపత్రి వరకూ..!

Last Updated : May 21, 2021, 11:26 PM IST

ABOUT THE AUTHOR

...view details