* తెలంగాణలోని హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ బంధువుల ఇంటికి చెన్నై నుంచి వచ్చిన ఓ మహిళ నెల రోజులుగా ఇక్కడే ఇరుక్కుపోయారు. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల అప్పటి నుంచి ఇక్కడే కాలం గడుపుతున్నారు. తన కుమారుడు కువైట్‌లో ఉండటం వల్ల.. కోడలు, మనుమలు చెన్నైలో ఉంటున్నారు. వారు అక్కడ... ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటూ తీవ్రంగా మదన పడుతున్నారు. ఎప్పటిలోగా లాక్‌డౌన్ పూర్తి అవుతుందోనని ఎదురు చూస్తున్నారు.
* మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనాథ్‌రెడ్డి హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని తెలిసిన వారి ఇంటికి వచ్చారు. ఇంతలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఇప్పుడు తిరిగి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఏదోలా ప్రైవేటు వాహనంలో వెళ్లాలన్నా.. వీలు కావడం లేదు. సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్నారని తెలియడం వల్ల అక్కడే ఉంటున్నారు. పోనీ ఎలాగోలా ఏపీకి వెళ్లినా 14 రోజులు క్యారంటైన్ తప్పదని తెలిసి అక్కడే ఉన్నారు.
* కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు శ్రీకాకుళం నుంచి వెళ్లిన ఓ మహిళ లాక్‌డౌన్‌తో చుట్టాల ఇంట్లో ఉండిపోయారు. ఆమె భర్త కూడా వైజాగ్‌లో ఇరుక్కుపోయారు. కుమార్తె పెళ్లి తేదీ దగ్గర పడటం వల్ల.. వేరే దారి లేక పెళ్లి వాయిదా వేసుకున్నారు.
హైదరాబాద్‌లోని చుట్టాల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వచ్చిన వారు కొందరైతే.. ఇంకేదో ముఖ్యమైన పనిమీద వచ్చి ఇరుక్కున్న వారు మరి కొందరు.. ఇలా ఎంతోమంది భాగ్యనగరంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ఇక్కడ ఉండలేక.. తమ ఊరికి వెళ్లలేక తీవ్ర వేదన పడుతున్నారు. కరోనా తగ్గి లాక్‌డౌన్‌కు ఎప్పుడు తెర పడుతుందా? అని ఎదురు చూస్తున్నారు. కరోనా కాస్త... కరుణిస్తే తమ ఊళ్లకు వెళ్లిపోతామని అంటున్నారు. ఇలాంటి వారు నిత్యం పదుల సంఖ్యలో ప్రభుత్వ కాల్ సెంటర్లతోపాటు, పలు కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. తమను ఎలాగైనా పంపాలని వేడుకుంటున్నారు. కొందరు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేసేది ఏమీ లేక అధికారులు వారికి సర్ది చెబుతున్నారు. కొందర్ని కౌన్సెలింగ్ చేస్తున్నారు.
ఎక్కువగా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తుండటం వల్ల రాష్ట్ర సరిహద్దులే కాదు.. జిల్లాల హద్దుల్ని కూడా మూసి వేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవర్ని అనుమతించడం లేదు. ఒకవేళ ఏదోలా వచ్చినా సరే 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఫలితంగా ఇక్కడే ఉంటూ రోజులు.. గంటలు.. క్షణాలు లెక్కపెడుతున్నారు. గతంలో సొంతూళ్లకు వెళ్లే వారికి పాసులు జారీ చేసిన నగర పోలీసులు.. తరువాత నిలుపుదల చేశారు. ఏదైనా అత్యవసమైతే మానవతా దృష్టితో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు అనుమతి ఇస్తున్నా.. ఆయా రాష్ట్రాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని చెబుతున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ అధికారి అనుమతులతో ఏపీ వెళ్లడానికి ఓ ప్రైవేటు వాహనం అద్దెకు తీసుకున్నారు. తీరా అక్కడికి చేరుకోగానే పోలీసులు అడ్డగించారు. ఎన్ని చెప్పినా.. పంపేది లేదని చెప్పడం వల్ల వేరే దారి లేక తిరిగి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఒక్క ఏపీ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు వెళ్లి తిరిగిన వచ్చిన వారు ఎందరో.. దీనితో వేరే దారి లేక బంధువులు, తెలిసిన వారు.. స్నేహితుల ఇళ్ల వద్ద కాలం గడుపుతున్నారు.
అందరిదీ అదే దారి...
ఇలా ముఖ్యమైన పనులతో వచ్చి ఇరుక్కున్న వారే కాదు... పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వారు కూడా సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే కాలి నడకన వెళ్లిపోతున్నారు. దూరం ఎంతైనా.. ఎండకు లెక్క చేయకుండా పిల్లాపాపలతో ఊరి బాట పడుతున్నారు. తీరా సొంతూళ్లు చేరుకున్నాక కూడా కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి వారిని అధికారులు గుర్తించి అక్కడ 14-20 రోజుల పాటు క్వారంటైన్‌కు పంపుతున్నారు. సొంతూళ్లే కాబట్టి... కొందరైతే క్వారంటైన్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గినా ఇప్పటికిప్పుడు ఉపాధి దొరుకుతుందనే ఆశలు లేవు. ఇంకా కొంత సమయం పడుతుంది.
ఇదీ చూడండి:కరోనాతో మహిళ మృతి... అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు