విశాఖ కేంద్రంగా వైకాపా భూకుంభకోణానికి పాల్పడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఓ మత సంస్థకు చెందిన 3.5 ఎకరాలపై మూడేళ్లుగా వివాదం నడుస్తోందన్న ఆయన... ఈ వివాదంలోకి సీఎం జగన్ బినామిలు ప్రవేశించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ.50 కోట్లు చేతులు మారాయని చెప్పారు. ఆ సంస్థకు చెందిన మొత్తం వెయ్యి కోట్ల ఆస్తులు, నెల్లకుండిల జంక్షన్ వద్ద 100 ఎకరాలు, సిరిపురం జంక్షన్ వద్ద 100 ఎకరాల్లో వైకాపా నాయకులు లే ఔట్లు వేశారని అన్నారు.
భీమిలి వద్ద 3 ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారని ఉమా మరో ఆరోపణ చేశారు. భూ కుంభకోణంలో.. సీఎం జగన్కు సన్నిహితుడైన ఆడిటర్ కీలకపాత్ర పోషించారని విమర్శించారు. సేవ్ విశాఖపట్నం అని ప్రజలు నినదిస్తున్నారన్న ఉమామహేశ్వరరావు... విశాఖలో వైకాపా నాయకులు సుమారు 6 వేల ఎకరాలు కొన్నారని మంగళగిరి తెదేపా కార్యాలయంలో వ్యాఖ్యానించారు.