విశాఖపట్నం సముద్రతీరంలో రుషికొండ వద్ద పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బీచ్ రిసార్టు భవనాల కూల్చివేత పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే రెండు కాటేజీలను శుక్రవారానికి పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక్కడ రుషికొండ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం 14 ఏళ్ల క్రితమే నిర్మించిన భవనాలను కూల్చడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ బీచ్ రిసార్టుపై ఇప్పటివరకు రూ.15 కోట్ల వరకు ఖర్చు చేయగా దాన్ని తొలగించి మరో కొత్త ప్రాజెక్టుకు రూ.91 కోట్లు ఖర్చు చేయనున్నారు.
రుషికొండ బీచ్ రిసార్టులో 22 గదులను రూ.2 కోట్లతో గత ఏడాదే ఆధునికీకరించారు. ఇందుకు గుత్తేదారుకు ఇంకా రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. అంతకుముందు సంవత్సరంలో రెస్టారెంట్, కాన్ఫరెన్స్ మందిరాన్ని రూ.కోటితో అభివృద్ధి చేశారు. హుద్‌హుద్ సమయంలో పనులకు కోట్ల రూపాయలు వెచ్చించారు. నూతన బ్లాక్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు దీనిపై రూ.8 కోట్ల వరకు వెచ్చించారు. అంతకుముందు దీన్ని రూ.3 కోట్లతో నిర్మించారు.