విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 2, 3 తేదీల్లో దిల్లీలో ఆందోళన చేపట్టడానికి వస్తున్న స్టీల్‌ప్లాంటు ఉద్యోగులపై దిల్లీ పోలీసులు నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. ఆదివారం వచ్చిన కొందరు ఉద్యోగులను కొత్త దిల్లీ రైల్వేస్టేషన్ వద్దనే అడ్డుకొని విచారణ చేపట్టినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేత కేఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఉద్యోగులను నిర్బంధించిన పోలీసులు చివరకు జాతీయస్థాయి వామపక్ష నేతల జోక్యంతో వదిలేసినట్లు సమాచారం. దిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతివ్వడానికి వచ్చారన్న నెపంతో పోలీసులు వారిని నానా ప్రశ్నలు వేసి విసిగించారు. తాము ఉద్యోగులమని, స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దిల్లీ వచ్చినట్లు చెప్పినా వినిపించుకోకుండా ఇబ్బంది పెట్టారు.
చివరకు విడిచిపెట్టిన తర్వాత కూడా వీరికి హోటళ్లలో గదులు ఇవ్వొద్దని రైల్వేస్టేషన్ సమీపంలోని హోటల్ యజమానులందరికీ హుకుం జారీచేసినట్లు విశాఖ ఉక్కు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే వచ్చి హోటల్‌లో దిగినవారినీ ఖాళీ చేయించారని వాపోయారు. ముగ్గురు ఏసీపీ స్థాయి అధికారులు కార్మికుల వద్దకు వచ్చి మీరు రైతు ఉద్యమానికి మద్దతు తెలపడానికి వచ్చారంటూ తమను వేధించినట్లు ఉక్కు ఉద్యోగులు తెలిపారు. గదులు ఇవ్వకపోవడంతో తాము రోడ్డుపై ఉన్నామని, తమ పోరాటాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్ ఆరోపించారు. అయినాసరే 2, 3 తేదీల్లో తమ పోరాటం కొనసాగుతుందన్నారు.