సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇళ్లు సందడిగా మారిపోతుంది. మార్కెట్లకు వెళ్లి రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తారు. కరోనా ప్రభావంతో చానాళ్లు ఇళ్లకే పరిమితమైన ప్రజలు... ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. దీంతో విశాఖలో జగదాంబ, ద్వారాకనగర్, డాబాగార్డెన్స్, పూర్ణమార్కెట్, ఎంవీపీ ప్రాంతాల్లో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. కానీ కొనుగోళ్లు మాత్రం ఆశాజనకంగా లేవని వ్యాపారులు అంటున్నారు. ఏడాది అంతా జరిగిన అమ్మకాలు ఒక ఎత్తు అయితే.. సంక్రాంతి అమ్మకాలు మరో ఎత్తు. అలాంటిది గతంతో పోల్చితే ఈ ఏడాది కొనుగోళ్లు తగ్గాయన్నది దుకాణ యజమానుల మాట.
సాధారణంగా సంక్రాంతికి.. వారం రోజులు ముందు నుంచే.. ప్రజలు కొత్త బట్టల కొనుగోలుకు... పల్లెల నుంచి పట్టణాలకు తరలివస్తారు. కొవిడ్ ప్రభావంతో గత ఆరు నెలలుగా పనులు లేక సంపాదన లేదు. వరుస తుపాన్లతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. దీంతో ఈ ఏడాది ఎక్కడా సంక్రాంతి ఉత్సాహం కనిపించడంలేదు. నెల్లూరు జిల్లా కావలి, గూడూరు, నాయుడుపేటల్లో వినియోగదారులు లేక మార్కెట్లు బోసిపోయాయి.