daspalla lands issue: విశాఖలో అత్యంత విలువైన దసపల్లా భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్దినెలలుగా ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా దస్త్రాలు కదిలాయి. అధికార యంత్రాంగం కూడా వంతపాడింది. దీంతో రూ.2వేల కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు దస్త్రం సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భూముల విషయంలో వైకాపా ముఖ్యనేత చక్రం తిప్పడంతో అధికారవర్గాలు దాసోహమన్నాయని చెబుతున్నారు.
* కొద్ది నెలల క్రితం విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున దసపల్లా భూముల స్థితిపై ప్రభుత్వానికి సవివర నివేదిక సమర్పించారు. అప్పటినుంచి దస్త్రం చకచకా కదిలింది. దసపల్లా భూముల వివాదంపై 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ తదుపరి చర్యలు తీసుకొనేందుకు ఆదేశాలివ్వాలని కలెక్టర్ తన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలు రాగానే దసపల్లా భూములపై ఉన్న 22ఎ ఆంక్షలను తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తారు.
ఏమిటీ వివాదం..
విశాఖ టౌన్ సర్వేసంఖ్య 1196, 1197, 1027, 1028ల్లో మొత్తం 60 ఎకరాల భూములున్నాయి. వీటిలో 40 ఎకరాల వరకు వుడా (ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ), నౌకాదళం, జీవీఎంసీ సేకరించాయి. మిగిలిన 20 ఎకరాల్లో 5 ఎకరాలను వివిధ అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 15 ఎకరాల చుట్టూనే కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ భూములు దసపల్లా రాజు వైరిచర్ల నారాయణగజపతిరాజుకు చెందినవి. ఆయన వాటిని తన కుమార్తె రాణీ కమలాదేవి పేరున 1938లో వీలునామా రాశారు. ‘ఎస్టేట్ అబాలిష్‌మెంట్’ చట్టం అమలులోకి వచ్చాక దసపల్లా భూములకు నాటి అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసరు ‘గ్రౌండు రెంట్’ పట్టా జారీచేశారు. దీనిపై 1981లో నాటి తహసీల్దార్ సర్వే అండ్ సెటిల్మెంటు కోర్టులో అప్పీలు వేశారు. అప్పటి సర్వేశాఖ కమిషనర్ ‘గ్రౌండు రెంట్’ పట్టాను రద్దుచేసి ఆ భూములు ప్రభుత్వానివేనని తేల్చారు. చివరికి 2001లో 22ఎ కింద చేరుస్తూ సర్వేశాఖ 657 జీవో జారీచేసింది.