అమెరికా అమ్మాయికి... ఆంధ్రా పెద్దాయనకు మధ్య ఫ్రెండ్ షిప్.! ఆమె రెండుపదుల వయసు దాటిన యువతి. ఈయన ఆరు పదుల వయసు దాటిన విశ్రాంత ఉద్యోగి. ఫేస్బుక్ వారి పరిచయానికి వేదికైంది. చివరకు ఆ పెద్దాయన అక్షరాల రూ.34 లక్షలు పొగొట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి అనేక సైబర్ నేరాలు మన విశాఖ పరిధిలోనే ఎక్కువ జరిగాయంటే అతిశయోక్తి కాదు.
చిన్న మెసేజ్... పెద్ద ముప్పు..!
ఎదో మాయలో పోర్న్ సైట్లు, డేటింగ్ సైట్లపై ఒక్క క్లిక్ చేశారా... అంతే... చేదు అనుభవానికి మీరు తలుపు తెరిచినట్టే. ఆ తరువాత ఏ ఇతర వెబ్సైట్ వెతికినా.. మన ప్రమేయం లేకుండానే... అశ్లీల సైట్లు మనకు హాయ్ చెబుతాయి. నిను వీడని నీడను నేనే అంటూ... డేటింగ్ టూ ఛాటింగ్ మత్తులోకి దింపేస్తాయి. మీ పర్స్ ఖాళీ చేస్తాయి.
ఫోన్ ఉంది కదా..! మీరు డబ్బులు గెల్చుకున్నట్టు సందేశ వస్తే నమ్మి... ఆహా ఇల్లు తీసుకోవాలి... కాదు కాదు.. టూర్ వెళ్లాలి అని ఫిక్సవుతున్నారా..! ఒక నిమిషం ఆలోచించండి. ఏళ్లపాటు కష్టపడితేనే.. కోటీశ్వరులు కావడం కష్టం. అలాంటింది ఒక మెసేజ్‌ను నమ్మి.. పరుగులు పెట్టాల్సిన అవసరం ఏముంది. బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు సంఖ్య, దాని వెనక ఉండే సీవీవీ నెంబరు... ఇలా మనం దాచుకుంది... దోచుకోవడానికి అవసరమైన సమాచారం సైబర్ దొంగకు చెప్పిస్తుంది ఆ చిన్న మెసేజ్.