అంతర్జాతీయ కేటుగాళ్లు..విశాఖ వాసిని ముంచేశారు! విశాఖలో విశ్రాంత ఉద్యోగి అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. ఏకంగా డెబ్బై లక్షల రూపాయలు పోగొట్టుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ కేటుగాళ్లు కేవలం ఒక మెయిల్‌తో రామకృష్ణ దగ్గర లక్షలు దోచేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న విశాఖ పోలీసులు వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
ఓ కార్డు ఇచ్చారు...
రాష్ట్రంలో సైబర్ నేరాల్లో విశాఖది మొదటి స్థానం. ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా... అత్యాశకు పోయి కొంప మోసపోతున్నారు. చదువురాని వారినైతే... మాయమాటలతో మభ్యపెట్టొచ్చు. ఒక సంస్థను ఆర్థిక ప్రగతి వైపు నడిపించే ఫైనాన్షియల్ మేనేజర్ హోదాలో ఉన్న విశాఖకు చెందిన రామకృష్ణరావు లాంటి చదువుకున్న వ్యక్తి.. ఇలాంటి మోసానిగి గురి కావడమే ఇక్కడ అసలు విషయం. నాలుగేళ్ల క్రితం అమెరికాలో 2,500 కోట్లు లాటరీ గెలిచినట్టు రామకృష్ణరావుకు ఓ సందేశం వచ్చింది. ఆ సొమ్ము పొందేలా బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డును సైబర్ నేరస్థులు పంపారు. ఆ డెబిట్ కార్డు నుంచి రోజుకు 5 వేలు నగదు పొందే అవకాశం ఉందని చెప్పారు. మొదటి సారి వినియోగిస్తే వెయ్యి రూపాయల వచ్చింది. తర్వాత పనిచేయలేదు. ఏటీఎం పిన్ జనరేట్ కావాలంటే సొమ్ము పంపాలని చెప్పి లక్షల రూపాయలు కాజేశారు.
రసాయనం పూస్తే...నోట్లు వస్తాయంటూ!
ఈ కథకు కొనసాగింపుగా...ఓ నైజీరియన్ వ్యక్తి రామకృష్ణ ఇంటికి వచ్చి కొన్ని తెల్ల నోట్లను ఇచ్చి వాటిని రసాయనాలతో కడిగితే విదేశీ డాలర్లు వచ్చేలా చేశాడు. ఇంకా విదేశీ నోట్లు పొందాలంటే రసాయనాల కోసం డబ్బులు పంపాలని మూడేళ్లుగా బాధితుడి నుంచి 70 లక్షలు బురిడీ కొట్టించారు. విషయం అర్థమైన రామకృష్ణ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు మెుదలుపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు 24 బ్యాంకు ఖాతాల నుంచి 48 వేర్వేరు లావాదేవీలతో 70 లక్షలు జమ చేసుకున్నట్లు విచారణలో గుర్తించారు. ఈ కేసు ఛేదనకు దిల్లీ ఇతర పట్టణాలకు బృందాలు వెళ్లి మరీ దర్యాప్తు చేస్తున్నాయి.