కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి కొత్త అవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. కరెన్సీ నోట్ల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న మేరకు.. వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు కరెన్సీ శానిటైజర్ బాక్సులు రూపొందించారు. నగదును ఎక్కువగా వినియోగించే రైల్వే శాఖ కోసం వాల్తేర్ డీజిల్ లోకో షెడ్ సిబ్బంది వీటిని తయారుచేశారు.
డీజిల్ లోకో షెడ్లో ఉన్న సామగ్రితోనే అదనపు ఖర్చు లేకుండా వీటిని రూపొందించారు. ఇప్పటికే హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్‌లు, శానిటైజేషన్ టన్నల్, కాలితో ఉపయోగించే శానిటైజేషన్ డిస్పెన్సర్ల వంటివి తూర్పు కోస్తా రైల్వే సిబ్బంది తయారు చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు.
యూవీ స్టెరిలైజేషన్తో నగదు శుద్ధి
తాజాగా అల్ట్రా వయోలెట్ రేడియేషన్ ఆధారిత కరెన్సీ శానిటైజేషన్ బాక్సులను తయారు చేశారు. ఇందులో కరెన్సీ, కార్యాలయ ఫైళ్లు, పేపర్లు యూవీ కిరణాలు ద్వారా వైరస్ రహితంగా మార్చుకునేందుకు వీలవుతుంది. టికెట్ల కౌంటర్ల వద్ద నగదును వినియోగదారుల నుంచి స్వీకరించాల్సి ఉంటుంది. కార్యాలయంలోనూ పేపర్లు ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కి పంపించాల్సి ఉంటుంది. వీటన్నంటిని యూవీ స్టెరిలైజేషన్ ద్వారా శానిటైజ్ చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వీలవుతుందని అధికారులు అంటున్నారు. వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ మార్గదర్శకత్వంలో డీజిల్ లోకో షెడ్ సీనియర్ డివిజినల్ మెకానికల్ ఇంజినీర్ సంతోష్ కుమార్ పాత్రో ఈ యూవీ బాక్సులను రూపొందించారు.