ప్రభుత్వ నిబంధనలు పాటించని కొవిడ్ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కొవిడ్ ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారులు ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించారు. 15 ఆస్పత్రుల్లో తనిఖీలు చేయగా... నాలుగు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
గుంటూరులోని నారాయణ హాస్పిటల్, అనంతపురంలోని సాయిరత్న హాస్పిటల్, విశాఖపట్నంలోని కుమార్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద బాధితులను చేర్చుకోకపోవడం, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంలో అక్రమాలకు పాల్పడడం వంటి అవకతవకలు గుర్తించారు. ఆ నాలుగు ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.