CPM Politburo Member BV Raghavulu: భాజపా ప్రభుత్వం నుంచి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. దేశ రక్షణ భేరి కార్యక్రమం చివరి రోజు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విశాఖలో జరిగిన ర్యాలీ, బహిరంగ సభలో బీవీ రాఘవులు పాల్గొన్నారు. సరస్వతీ పార్కు నుంచి డాబాగార్డెన్స్, ఎల్‌ఐసీ బిల్డింగ్ మీదుగా వైయస్‌ఆర్ సెంట్రల్ పార్క్ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వదేశీ పెట్టుబడిదారులైన అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు.
ప్రపంచంలో చమురు ధరలు తగ్గుతున్నా.. మన దేశంలో ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు. సామాన్యులు వినియోగించే అన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించి పన్నుల భారం విదిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు సైతం మోదీ ప్రభుత్వ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, ఇతర విభజన హామీలను కేంద్రం ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోగా.. ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయడానికి సిద్ధపడటం సిగ్గుమాలిన పని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు అమ్మేయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా వైకాపా ప్రభుత్వం భాజపాను ఏమి అనటం లేదని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలన అంతం కావాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని అన్నారు.