రాష్ట్రంలో సంచలనంగా మారిన డ్రగ్స్ అంశంపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 239 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించిన నారాయణ.. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, వాటిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం.. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన డగ్స్ అంశంపై మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ వాడేవాళ్లను పట్టుకుంటున్నారు కానీ.. సరఫరా చేసేవారిని మాత్రం పట్టుకోవటం లేదని ఆరోపించారు. అఫ్గాన్ నుంచి విజయవాడకు డ్రగ్స్ వస్తున్నాయని నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం డ్రగ్స్‌పై సిట్ వేసినా..దానివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని అన్నారు. డ్రగ్స్ మాఫియా వంటి దారుణాలకు అడ్డుకట్ట వేయడం వామపక్షాలతోనే సాధ్యమవుతుందన్నారు.
డ్రగ్స్ వాడేవాళ్లను పట్టుకుంటారు.. సరఫరా చేసేవారిని పట్టుకోరు. భూములు, డ్రగ్స్‌పై ఏపీ ప్రభుత్వం సిట్ వేసింది. కానీ ఎలాంటి ఉపయోగమూ లేదు. అఫ్గాన్ నుంచి విజయవాడకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయాలంటే వామపక్షాలతోనే సాధ్యం. - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి