విశాఖలోని బీచ్ రోడ్డులో అత్యంత ఖరీదైన 13.59 ఎకరాల స్థలాన్ని ఏపీ బిల్డ్ పేరిట అమ్మకాలు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీపీఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం. పైడిరాజు డిమాండ్ చేశారు. ఈ చర్యను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని.. కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈనెల 9న జరిగే జీవీఎంసీ పాలకవర్గం సమావేశంలో ప్రభుత్వ భూముల అమ్మడానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పైడిరాజు డిమాండ్ చేశారు.
గత తెదేపా ప్రభుత్వ హయాంలో భూములను లులూ గ్రూపునకు కట్టబెట్టాలన్న ప్రయత్నాలను వ్యతిరేకించిన సీఎం జగన్.. ఇప్పుడు భూములను అమ్మాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. విశాఖ నగరం చుట్టుపక్కల వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటన్నింటినీ తీసుకొని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సూచించారు.