విశాఖలోని ప్రభుత్వ ఈఎన్టీ, ప్రథమ ఆస్పత్రులతో పాటు సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో.. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించినట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 34,761 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల ఆరోగ్య కార్యకర్తలకు.. మొదటి దశలో టీకా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా రూపొందించిన కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో గుర్తింపు కార్డుల ఆధారంగా వారి వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా.. జిల్లాలో డ్రై రన్ నిర్వహించామని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోనికి వచ్చిన తరువాత ఏ విధంగా ప్రజలకు అందించాలనే సన్నద్ధత కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. మొదటగా ఆరోగ్య కార్యకర్తలకు, వైరస్‌కు వ్యతిరేకంగా ముందుండి పోరాడిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బందికి రెండవ దశలో టీకా వేస్తామన్నారు. మూడవ దశలో యాభై ఏళ్లు దాటిన, కోమార్బిడిటీస్ పరిస్ధితులున్న 50 ఏళ్లలోపు వైరస్ బాధితులకు అందిస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రాంతీయ గోదామును.. విశాఖ నగరంలో ఏర్పాటు చేసి టీకాలను భద్రపరుస్తామని తెలిపారు. 17 లక్షల డోసులను నిల్వ చేసే సదుపాయం ప్రస్తుతం మన దగ్గర ఉందని వివరించారు.