పుర ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 10-10.30 గంటల మధ్య తొలి ఫలితం వెలువడనుంది. సాయంత్రం 6 గంటల్లోగా మహా నగర విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మినహా అన్నిచోట్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖలో డివిజన్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. 11 నగరపాలక సంస్థల్లో 533 డివిజన్ సభ్యుల స్థానాలకు పోలైన 27,29,072 ఓట్లను లెక్కిస్తున్నారు. 71 పురపాలక, నగర పంచాయతీల్లో 1,633 వార్డు సభ్యుల స్థానాలకు పోలైన 21,03,284 ఓట్ల లెక్కింపు చేపట్టారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఇక్కడ విజేతలకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల్లో హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని సూచిస్తారు. పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో పోలైన మొత్తం ఓట్లను 4,026 టేబుళ్లలో 12,607 మంది సిబ్బంది లెక్కిస్తున్నారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్లు..