ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయా..?

విశాఖ జిల్లాలో కొత్త కొవిడ్ కేసుల సంఖ్య‌లో త‌గ్గుద‌ల న‌మోద‌వుతున్నా... ఇంకా సరళ రేఖకు రాలేదు. కేసుల పెరుగుదలలో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. ఆగస్టు ఒక్క నెలలోనే కేసులు మూడు రెట్లు పెరిగిపోయాయి. సగటున 900 నుంచి 1200 వరకు కొత్త కేసులు నమోదు అవుతూ వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు కొత్త కేసులు 8500 వరకు నమోదు కావడం ఉద్ధృతికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. కేసులు తగ్గుముఖం సూచన గ‌త వారం రోజులుగా ఉన్నా... అది తాత్కాలికమా, ఇదే ప‌రిస్ధితి త‌గ్గుద‌ల‌కు సూచ‌నా అన్న‌ది ఇంకా కొన్ని రోజులు గ‌డిస్తేగాని చెప్ప‌లేమ‌ని వైద్య వ‌ర్గాలు, గ‌ణాంక ప‌రిశీల‌కుల అంచ‌నా.

Corona Latest Update in Visakhapatnam District
విశాఖ.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయా..?

By

Published : Sep 18, 2020, 9:20 AM IST

విశాఖ జిల్లాలో కొవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య క్ర‌మంగా పెంచుతూ వ‌చ్చారు. ఇప్పుడు స‌గ‌టున ఆరు నుంచి ఏడు వేల టెస్టులు చేస్తున్నారు. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ప‌రీక్షా కేంద్రాల‌లో అటు ట్రూనాట్​ల నుంచి పీసీపీఐఆర్ టెస్టుల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. కొవిడ్ కేసుల పురోగ‌తిని ప‌రిశీలిస్తే మార్చి నెల‌లో తొలి కొవిడ్ కేసు న‌మోదైన ద‌గ్గ‌ర నుంచి, ఏప్రిల్ నెలలో కేవలం మూడు కేసులకు చేరినా... క్ర‌మంగా వీటి వ్యాప్తి పెరుగుతూ వ‌చ్చింది. న‌గ‌ర ప్రాంతానికే ప‌రిమితమైంద‌ని భావించిన కొత్త కేసుల న‌మోదు.. గ్రామీణ ప్రాంతాల‌కు, గిరిజ‌న ప్రాంతాల‌కూ విస్త‌రించింది. అన్​లాక్ ప్ర‌క్రియ మొద‌లైన‌ప్ప‌టి నుంచి కొత్త కేసులు సంఖ్య పెరిగింది. ఈనెల మూడో వారంనాటిక‌ల్లా.. అంటే సెప్టెంబర్ 17 నాటికి జిల్లాలో 46 వేల కేసుల‌ మార్కుకి చేరింది. మృతుల సంఖ్య 350కి దగ్గరలో ఉంది. ఇవన్నీ అధికారిక లెక్కలు. అన‌ధికారిక కేసులు మృతుల సంఖ్య మ‌రికొంత ఈ గ‌ణాంకాల‌కు జ‌త అయ్యే అవ‌కాశం ఉంది.

పెరుగుతున్న మరణాల సంఖ్య..!

సర్వైలెన్స్ సర్వే పేరిట కొవిడ్ ఎంతమందికి వచ్చి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరిశీలనలో 5 వేల లోపు శాంపిల్స్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఇందులోనూ దాదాపు న‌గ‌ర జ‌నాభాలో 20 శాతం మందికి కొవిడ్ వచ్చి వెళ్లి పోయిన‌ట్టుగా ఈ సర్వే ద్వారా అంచ‌నాకి వ‌చ్చారు. విశాఖ జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య మార్చి నెలాఖరుకు కేవలం 10 కేసులులోపుగానే ఉన్నాయి. జూన్ నెల వరకు మరణాలు కేవలం ఒక్క‌టి మాత్ర‌మే నమోదయింది. జూన్ నెలలో కూడా యాక్టివ్ కేసులు రెండు అంకెల్లోనే ఉన్నాయి. జూలైలో మరణాల సంఖ్య రెండు అంకెలకు చేరింది. కొత్త కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతూ వచ్చింది. ఆగస్టు నెల మొదట్లోనే మృతుల సంఖ్య వంద మార్కును దాటేసింది. ఆగస్టు నెల అంతా కొవిడ్ మృతుల సంఖ్య సగటున 5 నుంచి ఏడు వరకు నమోదు అవుతూ వచ్చింది.

పెరిగిన ఒత్తిడి...

ఫ‌లితంగా మృతుల గ‌ణాంకాల‌లోనూ వేగంగా వృద్ది క‌న్పించింది. కొత్త కేసుల జోరు గ‌ణ‌నీయంగా ఉన్న నెల‌గా ఆగ‌స్టును ప‌రిగ‌ణించాల్సి ఉంది. ఆగస్టు 10 నాటికి మొత్తం కేసుల సంఖ్య 20,000 మార్క్ దాటితే.. అక్కడి రెండు వారాలు గ‌డ‌వ‌క ముందే మ‌రో ప‌దివేల కేసులు జ‌త అయ్యాయి. మృతుల సంఖ్య కూడా 200 అంకెను దాటేసింది. ఇదే నెలలో 23 తేదీ నాటికల్లా 30 వేల కేసులకు పైగా న‌మోదైతే, 29 నాటికల్లా ఈ సంఖ్య 35 వేలు దాటేసి పరుగులు తీసింది. ఒక్క అగ‌స్టు నెల‌లోనే దాదాపు 27 వేల కొత్త కేసుల న‌మోదు అధికార యంత్రాంగంపైనా, వైద్య సేవ‌ల‌పైనా ఒ‌త్తిడి పెంచింది.

అందుబాటులోకి ఆరు వేల పడకలు

సెప్టెంబర్ 4 నాటికి 40 వేల మార్కును అందుకుంది. సెప్టెంబర్ 9 నాటి కల్లా మృతుల సంఖ్య 306 కి చేరింది. సెప్టెంబర్ 15 నాటికల్లా 45వేల మార్కను దాటేసింది. సెప్టెంబ‌ర్ నెల‌లో ఇప్ప‌టిక‌వ‌ర‌కు 17 రోజుల్లో దాదాపు ఎనిమిదిన్న‌ర వేల వేల కేసులు నమోద‌య్యాయి. ఆగస్టు నెలతో పోలిస్తే కొత్త కేసులు నమోదు తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ కేసుల జోరు త‌గ్గుద‌ల ఒక మంచి ప‌రిణామ‌మ‌న్న‌ది వైద్యుల అంచ‌నా. విశాఖ జిల్లాలో తొలి నుంచి రిక‌వ‌రీ రేటు గ‌ణ‌నీయంగా ఉండ‌డం వైద్య వ‌ర్గాల‌కు ఊర‌ట నిచ్చేదే అయినా... ఇక్క‌డ ఉన్న వైద్య స‌దుపాయాల దృష్ట్యా అటు ఒడిశా.. చ‌త్తీస్​గ‌డ్, ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి మెరుగైన వైద్యాన్ని ప్ర‌యివేటు రంగంలో పొందేందుకు వ‌చ్చేవారి సంఖ్య ఏమీ త‌క్కువ‌కాదు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన మేర‌కు ప్ర‌భుత్వ రంగంలో జిల్లాలో ఆరువేల ప‌డ‌క‌లు అందుబాటులోకి తెచ్చారు. మ‌రో ఐదువేల వ‌ర‌కు ఐసొలేష‌న్ స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నారు.

జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు కొవిడ్ కేసుల‌లో ఉన్న అంశాల‌ను విశ్లేషిస్తే... మూడు మంచి ప‌రిణామాల‌ను గుర్తించాల్సి ఉంది. ఇందులో మొద‌టిది రిక‌వ‌రీ రేటు. ఇది దాదాపు 99 శాతం ఉంటోంది. రెండవ‌ది మ‌ర‌ణాల రేటు ఒక శాతంలోపు ఉండ‌డం. మూడోది ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిన‌ప్ప‌టికీ... పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గ‌డం. ఆగ‌స్టు నెల‌లో జిల్లాలో చేసిన ప‌రీక్ష‌ల‌లో 18 నుంచి 21 శాతం వ‌ర‌కు పాజిటివ్ రేటు ఉంటే.. ఇప్పుడది ఎనిమిది శాతంగా న‌మోద‌వుతోంది. ప్ర‌స్తుతం స‌గ‌టున ఐదునుంచి ఆరువేల టెస్టులు చేస్తున్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ త‌గ్గుద‌ల ఇదే స్థాయిలో ఉంటుందా లేదంటే తీవ్రత మ‌ళ్లీ పెరుగుతుందా అన్న‌దే ఇప్పుడు వైద్య వ‌ర్గాలు, విశ్లేష‌కులు దృష్టి సారించిన అంశం.

ABOUT THE AUTHOR

...view details