ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆదాయానికి కరోనా గండి - ఏపీలో రిజిస్ట్రేషన్ పై కరోనా ప్రభావం

కరోనా ప్రభావంతో విశాఖ జిల్లాలో పలు పౌర సేవలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్రభుత్వానికి అదాయం తెచ్చే శాఖలైన రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపైనా పౌర సేవా విభాగాలపైనా ప్రభావం చూపుతోంది. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో దాదాపు 5 నుంచి ఆరు శాతం మంది సిబ్బంది కొవిడ్ బారిన పడి హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొవిడ్ తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రతి నిత్యం రిజిస్ట్రేషన్ కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారి నుంచి వేలి ముద్రలు సేకరించడం, పలు చోట్ల సంతకాలు చేయాల్సి రావడం వంటి వాటి వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీనికి తోడు కార్యాలయాల్లోకి వచ్చి పోయే వారిని తనిఖీ చేసే వ్యవస్ధలు అంత పటిష్టంగా లేకపోవడం కూడా వ్యాప్తికి ఒక కారణంగా నిలుస్తోంది.

corona effect  on registrations in andhra pradesh
ఆదాయానికి కరోనా గండి

By

Published : Sep 10, 2020, 10:43 AM IST

కొవిడ్‌ కారణంగా గడచిన 7 నెలలుగా ప్రభుత్వం అందించే పౌరసేవలన్నీ ప్రభావితమయ్యాయి. క్షేత్రస్థాయి నుంచీ రాష్ట్ర సచివాలయం వరకూ అరకొరగానే సేవలు అందించాల్సిన పరిస్థితే ఇంకా ఉంది. వాణిజ్య పన్నులు, విద్యుత్ బిల్లులు, పురపాలికలు, గ్రామ పంచాయితీల పన్నులు, ప్రజలకు జారీచేసే ధ్రువపత్రాల ఛార్జీలు తదితర వసూళ్లు పూర్తిస్థాయిలో జరగట్లేదు. ప్రజలకు పౌరసేవలూ దూరం కావటంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. ప్రత్యేకించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 76.81 శాతం పడిపోయింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 740 కోట్ల రూపాయలు ఉంటే..ఈ ఏడాది మేలో అది కేవలం 171.63 కోట్లు మాత్రమే ఆగిపోయింది. చాలా కార్యాలయాలు కట్టడి జోన్లలో ఉండటం, సిబ్బందికీ కరోనా సోకటం వంటి కారణాలతో ప్రజాసేవల కోసం ఎక్కువ మంది రావట్లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 9 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 49 వేల 871 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏడాదిలో 2 వేల 700 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతుందని భావించినా..లక్ష్యంలో 67శాతం మాత్రమే సాధిస్తామని రిజిస్ట్రేషన్లశాఖ అంచనా వేస్తోంది.

కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-దస్త్రాల వినియోగం పెరగడంతో... ప్రజలకు నేరుగా అందించాల్సిన ధ్రువపత్రాల జారీ ఆలస్యమవుతోంది. మొత్తం 548 పౌర సేవల్ని గ్రామ సచివాలయాల ద్వారానే అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ .. వస్తున్న ధరఖాస్తులు పరిమితంగానే ఉంటున్నాయి. యూజర్ ఛార్జీల పేరిట రావాల్సిన ఆదాయమూ గణనీయంగా తగ్గింది. కొవిడ్‌తో సిబ్బంది గైర్హాజరు, కార్యాలయాల మూసివేత కారణాలతో పరిష్కరించాల్సిన దస్త్రాలూ పేరుకుపోతున్నాయి. మొత్తం ఇ-దస్త్రాల సంఖ్య లక్ష 12 వేల 505 ఉంటే... గడచిన 15రోజుల్లో కేవలం 28వేల 111దస్త్రాలే పరిష్కారమయ్యాయి. రాష్ట్రస్థాయిలో విభాగాధిపతులు ద్వారా పరిష్కారమైన ఇ-ఫైల్స్‌ సంఖ్య కేవలం 19మాత్రమే. స్పందన కార్యక్రమంలోనూ విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించి 49 లక్షల 80 వేల ఫిర్యాదులు ఇప్పటి వరకూ అందినట్టు ప్రభుత్వం చెబుతోంది. అత్యధికంగా పౌరసరఫరాల శాఖలో రేషన్‌ కార్డులు మంజూరు కోరుతూ 23 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. తరువాతి స్థానంలో 7 లక్షల 61 వేల దరఖాస్తుతో భూపరిపాలనశాఖ ఉండగా..2 లక్షల 33 వేలకుపైగా దరఖాస్తులతో పురపాలకశాఖ నిలిచింది.

ఎక్సైజ్‌ ఆదాయం, మోటారు వాహనాల పన్నులు, రిజిస్ట్రేషన్లు, వివిధ వాణిజ్య పన్నులు సహా మొత్తంగా నెలకు 5వేల కోట్ల రూపాయల మేర పౌరసేవలపై ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 15 వేల 17 కోట్లు మాత్రమే వసూలైంది. అన్‌లాక్‌ అమలవుతున్నప్పటికీ..ఎమ్ఎస్​ఎమ్​ఈలు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయం పడిపోయింది. కొవిడ్‌ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం 10 వేల 554 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్రానికి అందించగా..సిబ్బంది వేతనాలు, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ 31 వేల కోట్ల మేర సెక్యూరిటీల విక్రయం, రుణాల రూపేనా సమీకరించింది.

ఇదీ చదవండి: జిల్లాల మధ్య అంతరాలు తగ్గిస్తేనే.. ఆదాయం రెట్టింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details